ఏపీలో అధికార పార్టీ వైసీపీ తరఫున పదేళ్లకు పైగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి రెండో టెర్మ్ పదవీ కాలం వచ్చే ఏడాది మే నెలతో ముగియనుంది. మరోమారు ఆయనను రాజ్యసభకు పంపే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఈ విషయంపై ఇంకా స్పష్టత రాకున్నా.. జగన్ మనసులోని మాటను అర్థం చేసుకున్న దరిమిలా సాయిరెడ్డే సైలెంట్ అయిపోయారు. సరే.. రాజ్యసభ పదవీ కాలం ముగిసేందుకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది కదా.. అప్పటిలోగా జగన్ మనసు మారొచ్చేమోనన్న ఆశ కూడా సాయిరెడ్డిలో కనిపించడం లేదు. మరోమారు ఛాన్స్ లేదన్న మాటకే అలిగి కూర్చున్న సాయిరెడ్డి.. తాజాగా చోటుచేసుకున్న రెండు కీలక పరిణామాలను కాస్తంత లోతుగా అర్థం చేసుకుంటే.. ఏకంగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికే రాజీనామా చేసేస్తారేమోనన్న వాదనలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అదే జరిగితే..2024 ఎన్నికల నాటికి వైసీపీ అంతర్గత కుమ్ములాటతో సతమతం కావడం తథ్యమేనన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.
అక్కడే కాదు.. ఇక్కడ కూడా..
ఇటీవలే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విమరణ చేసిన ఆదిత్యనాథ్ దాస్ ను జగన్ ముఖ్య సలహాదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. కేబినెట్ ర్యాంకులో ఈ పదవిలో నియమితులైన దాస్.. ఢిల్లీలోని ఏపీ భవన్ కేంద్రంగా విధులు నిర్వర్తించనున్నారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానం కల్పించే కీలక బాధ్యతలను దాస్ నిర్వర్తించనున్నారట. ప్రస్తుతం ఆ పనిని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత హోదాలో చేస్తున్నారు. అయితే ఆయనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే దాస్‌ను ఢిల్లీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించేశారు. అంటే.. సాయిరెడ్డి బాధ్యతలన్నీ దాస్ కు దఖలు పడినట్టే. అదే సమయంలో పార్టీ ఉత్తరాంధ్ర చీఫ్ గా వ్యవహరిస్తున్న సాయిరెడ్డి కారణంగా ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి విశాఖకు చెందిన పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిలో కొనసాగుతున్నారు. వీరందరి అంసతృప్తిని చల్లబరిచే పనిని జగన్.. తన పార్టీ సేవల కోసం వినియోగిస్తున్న ప్రశాంత్ కిశోర్‌కు అప్పగించారట. అందులో భాగంగా ఇప్పటికే పీకే టీమ్ విశాఖలో వాలిపోయిందట. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలను పీకే బృందం కలిసి వారి అసంతృప్తికి గల కారణాలు, అధిష్ఠానం తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై వివరాలు సేకరిస్తున్నారట. పార్టీ ఉత్తరాంధ్ర ఇంచార్జీగా ఉన్న సాయిరెడ్డికి ఈ విషయం ఇప్పటిదాకా తెలియనే లేదట. ఇటీవలే జరిగిన కేబినెట్ భేటీలో వచ్చే ఏడాది మార్చి నుంచి పీకే బృందం రంగంలోకి దిగుతుందని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆరు నెలలు ముందుగానే పీకే బృందం విశాఖలో రంగంలోకి దిగిన వైనం చూస్తుంటే.. ఉత్తరాంధ్ర ఇంచార్జీ బాధ్యతలను కూడా సాయిరెడ్డి నుంచి తప్పించడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మరి సాయిరెడ్డి పరిస్థితేంటీ?
జగన్‌తో సాయిరెడ్డికి విడదీయలేని బంధం అయితే ఉంది. ఈ బంధాన్ని ఏ చిన్న కారణాలతోనో తెంచుకునేందుకు జగన్ సిద్ధంగా లేరని కూడా చెప్పక తప్పదు. అంతేకాకుండా తన ఆర్థిక వ్యవహారాన్నింటినీ చక్కబెట్టే సాయిరెడ్డిని జగన్ దూరం చేసుకోరని సొంత పార్టీతో పాటు వైరి వర్గాలూ భావిస్తున్నాయి. మరి అటు ఢిల్లీలో అధికారాలకు కత్తెరేసి.. ఇటు ఉత్తరాంధ్ర ఇంచార్జీ పదవిని తొలగించేస్తే మరి సాయిరెడ్డికి ఎలాంటి పదవి అప్పగిస్తారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఉత్తరాంధ్ర ఇంచార్జీగా తనదైన శైలిలో చక్రం తిప్పుతున్న సాయిరెడ్డి.. జగన్ కు తెలియకుండా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారన్న వార్తలు గతంలో కలకలం రేపాయి. అయితే పార్టీ ఇన్నర్ సర్కిళ్లలో ఓ ఆసక్తికరమైన వాదన వినిపిస్తోంది. ఢిల్లీ నుంచి పూర్తిగా తప్పించేసి సాయిరెడ్డిని రాష్ట్రానికే పరిమితం చేయడంతో పాటు జగన్ తన కేబినెట్ లోకి సాయిరెడ్డిని తీసుకుంటారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే సామాజిక సమీకరణాల మేరకు కేబినెట్ పదవులను బ్యాలెన్స్ చేయలేక జగన్ సతమతం అవుతుంటే..సాయిరెడ్డి రూపంలో మరో సాహసానికి ఆయన దిగలేరన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మొత్తంగా సాయిరెడ్డి భవిష్యత్తు ఏమిటన్న విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
Must Read ;- సాయిరెడ్డికి నో మోర్ ఛాన్స్