Did Jagan Fix A Date For The Cabinet Reshuffle :
ఏపీలో ఇప్పుడు కొత్త చర్చలు మొదలయ్యాయి. రాష్ట్ర మంత్రివర్గంలో ఉండేదెవరు? పదవులు కోల్పోయేవారెవరు? అన్న దిశగా ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. జగన్ కేబినెట్ లోకి కొత్తగా చేరే వారెవరు? అన్న చర్చలకు బదులుగా.. జగన్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురయ్యేవారెవరు? అన్న దిశగానే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో రీషఫిలింగ్ తర్వాత కూడా జగన్ కేబినెట్ లో కొనసాగే మంత్రులు ఎవరు? అన్న చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. అంతేకాకుండా కేబినెట్ రీషఫిలింగ్ కు జగన్ ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని, వచ్చే నెల (అక్టోబర్) 15ను ఆయన తన కేబినెట్ ను పునర్వవస్థీకరించనున్నారన్న వార్తలు కూడా వైరల్ గా మారాయి. ఈ మొత్తం చర్చలన్నీ.. విపక్షాల్లో కాకుండా.. అధికార పార్టీలోనే జోరుగా సాగుతున్నాయి.
వంద శాతమా?.. 90 శాతమా?
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జగన్ తన కేబినెట్ లోని మొత్తం మంత్రులను పీకేసి.. మొత్తం కేబినెట్ ను కొత్త మంత్రులతో నింపుతారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ మాటను జగన్‌కు మామ, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డే స్వయంగా చెప్పారు. అయితే ఇతరుల మాట ఎలా ఉన్నా రాయలసీమకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణలను కేబినెట్ నుంచి తప్పించడం జగన్ కు సాధ్యం కాదని, వీరిద్దరితో పాటు మరో ఇద్దరు మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, కొడాలి నానిలను కూడా జగన్ తన మంత్రివర్గం నుంచి తప్పించరన్న వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వీరు నలుగురు మినహా మిగిలిన మంత్రులందరూ హైటెన్షన్ లో కొనసాగుతున్నారు. వీరితో పాటు పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని, అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పుష్పశ్రీవాణిలు తమ మంత్రి పదవులకు ముప్పేమీ లేదన్న ధైర్యంతోనే ఉన్నారు. మిగిలిన వారంతా తమ పదవులు గోవిందా అన్న భావనలోనే ఉన్నారు. అయితే తమ మంత్రి పదవులను నిలుపుకునేందుకు ఆయా మంత్రులు తమదైన శైలిలో సత్తా చాటడం మొదలెట్టేశారు. ఇందుకు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, అవంతి శ్రీనివాస్ ల ఘాటు వ్యాఖ్యలే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జగన్ కొత్త జాబితా రెడీ చేశారా?
రెండున్నరేళ్ల తర్వాత తన మంత్రివర్గాన్ని పూర్తిగా పునర్వవస్థీకరిస్తానని జగన్ ఆదిలోనే చెప్పేశారు. అందుకు మంత్రులంతా సిద్ధంగానే ఉండాలని, పదవి పోయిందని బాధపడాల్సిన అవసరం లేదని, పార్టీ పదవులు అప్పగిస్తానని చెప్పారు. నాడు జగన్ మాటకు అందరూ ఉత్సాహంగానే తలూపారు. అయితే ఇప్పుడు రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ రీషఫిలింగ్ అంటేనే మంత్రులంతా వణికిపోతున్నారు. అదే సమయంలో రెండున్నరేళ్లు ఎలాగూ మంత్రిగా అవకాశం లేకున్నా ఓపిక పట్టాం కదా.. ఇప్పుడు కూడా తమకు మినిస్టర్ గిరీలు దక్కకపోతే ఎలాగంటూ ఆశావహులు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ దృష్టిలో పడేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో కొందరు సక్సెస్ అవుతున్నా.. మరికొందరు మాత్రం చతికిలబడుతున్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ దూసుకుపోతుండగా.. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాత్రం చతికిలబడిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తుంటే.. జగన్ మాత్రం తన కొత్త జట్టుకు సంబంధించిన జాబితాను ఇప్పటికే రెడీ చేసుకున్నారన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- బాబు సవాల్‌కు జగన్ సిద్ధమా?