అధికార వైసీపీ, ప్రతిపక్షంలోని టీడీపీ నాయకుల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ విషయం అందిరికీ తెలిసిందే. అయితే గుంటూరు జిల్లాలో ఓ వైసీపీ ఎంపీ, టీడీపీ కీలక నేత ఓ విషయంలో కలసి పనిచేస్తున్నారని సమాచారం. వీరిద్దరూ గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వైసీపీ ఎంపీపై కొందరు ఎమ్మెల్యేలు పార్టీ అధినేతకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే
గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకోవడంతో ఇక పల్నాడు జిల్లా ఏర్పాటుకు ప్రతిపక్షాలు ఉద్యమానికి సిద్దం అవుతున్నాయి. అయితే నరసరావుపేట వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడంతో నరసరావుపేట వైసీపీ నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిపై వైసీపీ శ్రేణులు ఒత్తిడి తేవడంతో వ్యవహారం సీఎంఓకు చేరిందని తెలుస్తోంది. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావుతో కుమ్మక్కయ్యారని కొందరు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లాల ఏర్పాటులో రాజకీయ ఒత్తిడులకు తావులేదని, ప్రజాభిప్రాయమే కీలకమని సీఎం చెప్పినట్టు తెలుస్తోంది.
Must Read: ప్రజాభిప్రాయం ముసుగులో జగన్ మాట తప్పుతారా?!
అయినా తగ్గని నేతలు
గురజాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు ప్రక్రియ అధికార పార్టీకి కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందనే అంచనాలతో ఆ పార్టీ అధినేత ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అందుకే జిల్లాల ఏర్పాటు అనేది ప్రజల సెంటిమెంట్ తో కూడుకున్న వ్యవహారం కావడంతో రాజకీయ ఒత్తిళ్ల కన్నా, ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు సష్టం చేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ నీలం సాహ్ని అధ్యయనం పూర్తి చేశారు. అయితే ప్రజాభిప్రాయం మాత్రం ఎక్కడా తీసుకోలేదు. సీఎం ఆదేశాలతో జిల్లాల ఏర్పాటులో ప్రజాభిప్రాయాలను సేకరించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారని తెలుస్తోంది. చివరకు గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పడే అవకావం ఉండటంతో అటు వైసీపీ ఎంపీ, టీడీపీ నేతలు కూడా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గురజాల కేంద్రంగా జిల్లా ఏర్పాటయ్యాక మా ఉద్యమాల వల్లే జిల్లా కేంద్రం వచ్చిందని పార్టీ మైలేజీ పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఎంపీపై వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటు బావుటా
నరసరావుపేట వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతో కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే పోరుకు దిగుతున్నారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పట్టుమని ఇద్దరు కూడా ఎంపీకి మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇక చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజనీ అయితే, నాకు తెలియకుండా నా నియోజకవర్గంలో నరసరావుపేట ఎంపీ కాలు పెట్టడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డికి ఎంపీకి శ్రీకృష్ణదేవరాయలకు జిల్లా కేంద్రం ఏర్పాటులో విభేదాలు బయటపడ్డాయి. దీంతో నరసరావుపేట ఎంపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని తెలుస్తోంది.











