నటరత్న నందమూరి తారక రామారావు మూడో తరం వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ పరిచయమై ఈ ఏప్రిల్ 14కు 25 ఏళ్లు అయ్యింది. గుణశేఖర్ దర్శకత్వంలో మల్లెమాల సుందర రామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్న పిల్లలతో తొలిసారిగా నిర్మించిన పౌరాణిక సినిమా ఇది. అంతకుముందు ‘బాలభారతం’ పేరుతో మహాభారతాన్ని సినిమాగా రూపొందించిన చరిత్ర ఉంది. శ్రీరాముడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు ఎందుకు సరిపోతాడని అనిపించిందోగాని జూనియర్ ఎన్టీఆర్ నట జీవితంలో ఇదో మణిహారం అని చెప్పవచ్చు. ఉత్తమ బాలల సినిమాగా జాతీయ అవార్డును సైతం ఇది సొంతం చేసుకుంది.

జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్సర్. అచ్చుగుద్దినట్టు తాత పోలికలు జూనియర్ ఉండటం బాగా కలిసొచ్చింది. అందుకేనేమో మహానటుడు ఎన్టీఆర్ సైతం మనవడికి నటుడిగా ఓ అవకాశం కల్పించారు. ‘రామాయణం’కు ముందే బాల జూనియర్ ఎన్టీఆర్ మొహానికి రంగేసుకున్న సంగతి చాలామందికి తెలియదు. ఆ సినిమా హిందీలో రూపొందిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా నటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ హిందీ వెర్షన్ విడుదలకు నోచుకోలేదు.
ఆ తర్వాత ‘రామాయణం’లో నటించే అవకాశం వరించింది. పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరైన తాత పోషించిన శ్రీరాముడి పాత్రను చిన్నప్పుడే ఈ తారక రాముడు పోషించడం విశేషం. ఎంవీఎస్ హరనాథరావు ఈ సినిమాకి మాటలు రాశారు. ఈ సినిమాలో సీతగా స్మితా మాధవ్ అనే బాల నటి నటించింది. అలా చూసినప్పుడు నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణానికి నేటికి 25 ఏళ్లు అని చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో ఐదేళ్లకు ఎన్టీఆర్ హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ సినిమాని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ నట జీవితానికి మల్లెమాల, రామోజీరావు అనే ఇద్దరు దిగ్గజాలు భీజం వేశారనే చెప్పాల్సి ఉంటుంది. 2001 మే 23న ‘నిన్నుచూడాలని’ విడుదలైంది.
బాలనటుడిగా 25 ఏళ్లు, హీరోగా 20 ఏళ్ల నట ప్రయాణానికి జూనియర్ ఎన్టీఆర్ చేరుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్వకత్వంలో రూపొందుతున్న ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గానూ ఎన్టీఆర్ గుర్తుంపు పొందబోతున్నారు. మహానటుడు ఎన్టీఆర్ నట వారసత్వాన్ని మూడో తరంలో ఆ స్థాయిలో నిలబెట్టిన ఘనత జూనియర్ ఎన్టీఆర్ కే దక్కుతుంది. పైగా అతి చిన్న వయసులో స్టార్ డమ్ సంపాదించిన ఏకైక నటుడిగానూ జూనియర్ ఎన్టీఆర్ ను చెప్పాల్సి ఉంటుంది. అటు నటన, ఇటు డ్యాన్సులు, ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగిన స్టామినా.. ఆ మహానటుడిని మరోసారి గుర్తు చేస్తున్నది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడేనని చెప్పక తప్పదు.
– హేమసుందర్
Must Read ;- కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్











