పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పిరియాడిక్ మూవీ రాధేశ్యామ్. ప్రభాస్ – పూజా హేగ్డే జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే.. ప్రభాస్ 25వ చిత్రం గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభాస్ 25వ చిత్రాన్ని ఈ నెల 7వ తేదీన ప్రకటించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. ఈ సినిమా మరొక ఎత్తు అని చెప్పచ్చు. ఆ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. కొంత మంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. ఎవరు అనేది తెలియలేదు. అయితే.. వరుసగా బ్లాక్ బస్టర్స్ అందించిన సెన్సేషనల్ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. అయితే.. ఆ దర్శకుడు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.
ఇక నిర్మాత విషయానికి వస్తే.. ప్రభాస్ తో బాహుబలి తర్వాత సినిమా చేయాలని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు కానీ.. సెట్ కాలేదు. ప్రభాస్ 25వ చిత్రాన్ని దిల్ రాజే నిర్మించనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అలాగే ప్రభాస్ తో సినిమా చేయాలని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్స్ హౌస్ లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా గట్టిగానే ప్రయత్నిస్తుంది. మరి.. ప్రభాస్ కెరీర్ లో కీలకమైన 25వ చిత్రాన్ని నిర్మించే అద్భుత అవకాశాన్ని ఎవరు దక్కించుకున్నారో తెలియాలంటే అక్టోబర్ 7 వరకు ఆగాల్సిందే.
Must Read ;- ప్రభాస్ ఆదిపురుష్ విడుదల వచ్చే ఏడాది ఆగస్టులో











