రామాయణ, భారత, భాగవత గ్రంథాలు చదివితే విలువలతో కూడిన జీవితం అలవడుతుందని, కుటుంబాలతో కలసిమెలిసి ఎలా జీవనం సాగించాలో అర్థమవుతుందని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలు బుధవారం చినముషిడివాడలోని తన పీఠంలో అత్యంత వైభవంగా జరిగాయి. పీఠం అధిష్ఠాన దేవత శారదమాతకు తొలి పూజలు నిర్వహించారు. పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. స్వామీజీకి శిష్య బృందం పాదపూజ చేశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర చేతులమీదుగా పీఠం శ్రీకార్యం పేద మహిళలకు చీరలు పంపిణీ చేసింది. అంతకు ముందు ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర స్వామి తన గురువులు స్వరూపానందేంద్రకు అభ్యంగన స్నానం చేయించారు. ఆ తర్వాత స్వామీజీ గో పూజ చేసి పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. అనంతరం స్వరూపానందేంద్ర తన అనుష్ఠాన దైవం సుబ్రమణ్యస్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. స్వరూపానందేంద్ర జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్య హోమం, ఆవహంతీ హోమం వేదోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణం చేశారు.
సామాజిక దృక్పథంతో ..
విశాఖ శారదాపీఠం తపోపీఠమని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. కేవలం పాండిత్యానికే ప్రాధాన్యం ఇవ్వకుండా సామాజిక దృక్పథంతో పీఠం ముందుకు సాగుతోందన్నారు. విప్లవాత్మకమైన ధర్మ పోరాటాలకు కూడా పీఠం వేదికైందన్నారు. హిందూ ధర్మరక్షణ కోసం శారదా పీఠం పుట్టిందని స్పష్టం చేశారు. శారదా పీఠానికి ఉన్నంత మంది మంది భక్తులు మరే పీఠానికి లేరన్నారు. పీఠం తరఫున పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. యువతీ యువకులు మానవసేవ చేస్తూ మంచి మార్గంలో పయనించాలని ఆకాంక్షించారు.
Must Read ;- జగన్ అతి భక్తికి ఇది నిదర్శనమా?











