జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓట్ల కోసం నాయకులు బస్తీల బాట పడుతున్నారు. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రజలను నమ్మించి ఓట్లు రాల్చుకునే ప్రయత్నాలు రకరకాలుగా చేస్తున్నారు. అయితే ఓట్ల కోసం బస్తీల బాట పడుతున్న కొంతమంది నేతలకు ఓటర్ల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
ఓట్ల కోసం ఆదివారం బస్తీబాట పట్టిన అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేకు అక్కడి స్థానిక ప్రజలు షాకిచ్చారు. నో రోడ్.. నో ఓట్ అంటూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్‌రావు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే రోడ్డేయాలంటూ యాప్రల్, జవహర్‌నగర్ ప్రజలు రోడ్డెక్కారు. రోడ్డు వేయండి.. ఓటు అడగండంటూ ఎమ్మెల్యేను నిలదిశారు. 2కి.మీ. వరకు ఫ్లకార్డులు చేతపట్టుకుని స్థానికులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఇటు రాలేదని, మరి ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడగటానికి వచ్చారని ఎమ్మెల్యేను యువత, మహిళలు నిలదీశారు.
Also Read:-దుబ్బాక గెలుపుపై టీఆర్ఎస్, బీజేపీ లెక్కలేంటి?
తాము జీహెచ్ఎంసీకి పన్నులు కడుతున్నామని, వాటితో రోడ్లు వేయాలని జవహర్‌నగర్, యాప్రల్ ప్రజలు ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోగానే సొంత నిధులతో రోడ్లు వేయిస్తానని మైనంపల్లి హనుమంతరావు ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆయన మాటలకు స్థానిక ప్రజలు సంతృప్తి చెందకపోవడంతో రోడ్లు వేయిస్తానని లెటర్ ప్యాడ్‌పై మైనంపల్లి సంతకం చేసీ ప్రమాణం చేయడంతో ఆ గొడవ కాస్త సద్దుమనిగినట్లు తెలుస్తోంది. స్థానిక సమస్యలపై ప్రజల్లో ఈ తరహా చైతన్యం రావడం హర్షించదగ్గ విషయమేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:-జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ?











