కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా‘ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో మ్యాజిక్ చేసిందో తెలిసిందే. నాగార్జున సినీ జీవితంలోనే అదో ప్రత్యేక చిత్రం. దీనికి సీక్వెల్ వస్తోందని ఎప్పటి నుండో టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఆ వార్తలపై నాగార్జున కాని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కాని స్పందించ లేదు. ఆమధ్య కాలంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్ ను దర్శకుడు హీరో రవితేజతో తీస్తున్నాడని పుకార్లు షికార్లు చేశాయి. కానీ అది ఒట్టి రూమర్ గానే మిగిలిపోయింది.
అయితే ఇన్నాళ్లకు ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్ పై ఒక క్లారిటీ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నదని తెలుస్తోంది. వచ్చే నెల డిసెంబర్ లో షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఈ సీక్వల్ కు ‘బంగార్రాజు’ టైటిల్ ను ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ‘సోగ్గాయే చిన్నినాయనా’ లో నాగార్జున పాత్ర పేరు అదే. అందులోని పాత్రతోనే సీక్వెల్ రూపొందుతోంది కాబట్టి.. దానికి అదే టైటిల్ ను ఫిక్సే చేసే ఉద్దేశంలో ఉన్నాడు దర్శకుడు.
సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను కంప్లిట్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. ఇంకా ఈ సినిమాకు హీరోయిన్ ఫైనల్ అవ్వలేదని, త్వరలోనే అన్ని విషయాలను మీడియా ముఖంగా దర్శకుడు తెలియజేస్తారని టాక్ నడుస్తోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా మంచి విజయం సాధించడం వలన సహజంగానే సీక్వల్ పై భారీ అంచనాలు ఉంటాయి. మరి ‘బంగార్రాజు’ సినిమా విశేషాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీలో రమ్యకృష్ణ?











