కరోనా కారణంగా మూతపడిన థియేటర్లు తెరచుకుంటే వెంటనే కాకపోయినా మెల్ల మెల్లగా ప్రేక్షకులు సినిమాలు చూడటం తిరిగి మొదలవుతుందని చిత్ర పరిశ్రమ ఎంతో ఆశగా ఉంది.
ఈ నేపథ్యంలో దీపావళికి థియేటర్లు తెరుచుకోకపోవడంతో కనీసం ఈ నెలాఖరుకు లేదా డిసెంబర్లో అయినా థియేటర్లు తప్పనిసరిగా ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఒకవేళ డిసెంబర్లో కూడా వాయిదా పడితే నూతన ఏడాదిలో ఎట్టిపరిస్థితులలో తెరచుకుంటాయని నిర్మాతలు ఎంతో నమ్మకంగా వున్నారు. దాంతో తమ సినిమాలను విడుదలకు అన్నివిధాలా సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాలు సంక్రాంతి పోటీకి సన్నద్ధమవుతున్నట్లు ప్రకటించాయి కూడా. గత సంక్రాంతికి పెద్ద పుంజులు గట్టిగానే పోటీ పడ్డాయి. మరి ఈసారి అలాంటి పుంజులు కనిపించడం లేదు.
Also Read:-సంక్రాంతి కంటే ముందుగానే రిలీజ్ కానున్న ‘రంగ్ దే’?
సాధారణంగా సంక్రాంతి పోటీలో పెద్ద, చిన్న కలుపుకుని ఐదు, ఆరు చిత్రాలు వుంటుంటాయి. అయితే థియేటర్లు మొదలైతే ఈ తడవ అంతకు ఎక్కువ సినిమాలు బరిలో నిలిచే అవకాశాలు లేకపోలేదని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం చిత్రీకరణ కొద్దిరోజుల క్రితం తిరిగి మొదలై శరవేగంగా జరుపుకుంటోంది. అన్నీ కుదిరితే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉందట. ఇప్పటికే రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న క్రాక్ చిత్రం సంక్రాంతి పోటీకి సిద్ధమౌతోంది.
Also Read:-2021 సంక్రాంతి బరిలో ‘రాధేశ్యామ్’ ?
ఆ మేరకు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. రవితేజ తనదైన వినోదం, యాక్షన్ అంశాలతో ఈ చిత్రంలో అలరించబోతున్నారు. రవితేజను ఎలా చూపిస్తే ప్రేక్షకాభిమానులకు నచ్చుతుందో ఆ కోణంలో ఆయన పాత్రను దర్శకుడు డిజైన్ చేశారట. ఇక భీష్మ చిత్రం తర్వాత నితిన్ నటిస్తున్న చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా సంక్రాంతి పోటీకి సన్నద్దమౌతోంది. నితిన్ కు మంచి విజయాన్ని అందించేలా ఈ చిత్రం వచ్చిందని చిత్ర బృందం చెబుతోంది. అలాగే ఈ పోటీలోనే అఖిల్ అక్కినేని దిగబోతున్నాడు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇక ఈ వరుసలోనే కొన్ని చిన్న చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా.. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమవుతున్న చిత్రాలు కూడా సంక్రాంతి పోటీలో నిలవనున్నాయి. తమిళంలో మంచి క్రేజ్ వున్న కథానాయకులలో విజయ్ ఒకరు. ఆయన నటిస్తున్న మాస్టర్ చిత్రం అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ సంక్రాంతికి సందడి చేయబోతోంది.
Must Read:-సంక్రాంతి కానుకగా కేజీయఫ్ 2 టీజర్?
మరోవైపు నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్ చిత్రాన్ని థియేటర్లు డిసెంబర్ లోగా తెరచుకుంటే ఆలస్యం కాకుండా డిసెంబర్ లోనే విడుదల చేయాలని అనుకుంటున్నారట. అదీకాకుండా డిసెంబర్ సెంటిమెంట్ నాగార్జునకు ఎక్కువగా ఉండటమే కారణమని అంటున్నారు. అప్పటికీ థియేటర్లు తెరచుకోకుంటే సంక్రాంతి పోటీలో దిగక తప్పదని కూడా చిత్ర పరిశ్రమలో వినిపిస్తోంది, గతంలో సంక్రాంతికి విడుదలైన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం విజయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారట.
Also Read:-హిమాలయాలకు పయనమైన వైల్డ్ డాగ్ చిత్ర బృందం
సంక్రాంతి లాంటి పండగ రోజులలో సెలవులు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఎక్కువ సినిమాలు ఒక్కసారి విడుదలైనా బావున్న వాటికి ప్రేక్షక ఆదరణ తప్పకుండా లభిస్తుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. అయినప్పటికీ తన రెండో కుమారుడు అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రానికి పోటీ కాకుండా తప్పనిసరి అయితే మాత్రం తేదీల విషయంలో కాస్త అటు ఇటుగా విడుదల చేస్తే బావుంటుందని అనుకుంటున్నారట.
వెంకటేష్ టైటిల్ పాత్రలో నటిస్తున్న నారప్ప చిత్రాన్ని కూడా సంక్రాంతి దాకా కాకుండా థియేటర్లు తెరచుకుంటే డిసెంబర్లోనే అనువైన తేదీని చూసుకుని విడుదల చేయాలని అనుకుంటున్నారని సమాచారం. ఒకవేళ డిసెంబర్లో కుదరకపోతే నారప్ప కూడా సంక్రాంతి పోటీలో దిగడం ఖాయమని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. అన్నీ అనుకునే విధంగా జరిగి..కరోనా అదుపులోకి రావడంతో పాటు వాక్సిన్ కూడా ప్రజల చెంతకు చేరువైతే ఈసారి సంక్రాంతి మరింత కోలాహలంగా ఉంటుందని..ఇంకా కొన్ని సినిమాలు సంక్రాంతిని లక్ష్యంగా చేసుకుంటాయని సినీవర్గాలు భావిస్తున్నాయి.
Also Read:-మళ్ళీ లెక్చరర్ గా అదరగొట్టబోతున్న వెంకీ