కరోనా కారణంగా ప్రపంచమంతా కుదేలైంది. అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. భారతదేశంలో సంఖ్యాపరంగా అత్యధిక చిత్రాలను నిర్మించే బాలీవుడ్ కు పోటీనిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమ అధిక చిత్రాలను తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా తెలుగు చిత్రసీమ దాదాపు తొమ్మిది నెలల పాటు స్తంభించిపోయింది. షూటింగులే కాదు థియేటర్ల మూసివేతతో సినిమాల విడుదలలు ఆగిపోయి ఆర్ధికంగా ఎంతో చితికిపోయింది. మరోవైపు పరిశ్రమనే నమ్ముకున్న వేలాదిమంది కార్మికులకు ఉపాధి లేక విలవిలలాడిపోయారు.
అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఇప్పుడిప్పుడే పలు నిబంధనలతో షూటింగులకు ప్రభుత్వ అనుమతులు లభించాయి. అయితే తెలంగాణ లోని థియేటర్లు ఎప్పడు తెరుచుకుంటాయా..? అని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సినీ పరిశ్రమపై వరాల జల్లు కురిపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకుని టీ .ఆర్.ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను సోమవారం కేసీఆర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమ అన్నివిధాలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కరోనా కారణంగా నష్టపోయిన పరిశ్రమను పునర్జీవింపజేస్తామని, చిన్న సినిమాలను ఆదుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో పదికోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీని రీ ఎంబర్స్ మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే .రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో ప్రదర్శనలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తామని చెప్పారు. కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర తరహాలో టిక్కెట్ల ధరను సవరించుకునే వెసులుబాటు కల్పిస్తామని అన్నారు. 6 నెలలు థియేటర్లలో కరెంటు బిల్లు రద్దు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.
Must Read ;- థియేటర్లలో సినిమా ఎప్పుడు చూపిస్తారు మామా?











