తెలంగాణ విమోచన దినోత్సవం- ప్రతి ఏడాది సెప్టెంబరు వస్తే.. తమ పార్టీ అస్తిత్వాన్ని చాటుకోవడానికి తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ నడిపించే ఒకానొక హైడ్రామా- విమోచన దినోత్సవం. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మళ్లీ ఆ కార్డును బయటకు తీస్తోంది. బీజేపీని గెలిపిస్తే.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం అని అంటోంది. హిందూత్వ, ఆరెస్సెస్ భావజాల శక్తులను మరింతగా ఆకట్టుకునేందుకు తప్ప.. ఇలాంటి విమోచన దినోత్సవ నినాదంలో ఏమాత్రం విలువలేదనే సంగతి అందరికీ తెలిసిందే.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. నిజాం సంస్థానాన్ని లొంగదీసుకుని భారత్‌లో కలిపేసిన సందర్భం అది. వల్లభాయ్ పటేల్ సారథ్యంలో నిజాంను ఓడించడం జరిగింది. ఆ రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని ప్రతి ఏడాదీ బిజెపి డిమాండ్ చేస్తుంటుంది. మేమే ఆ దినోత్సవాన్ని నిర్వహిస్తాం అంటూ కాస్త రాద్ధాంతం చేస్తుంటుంది.
నిజాం ముస్లిం అయినంత మాత్రాన- నిజాంను భారత ప్రభుత్వం ఓడించడం అనేది ముస్లిం జాతి మొత్తానికి ఓటమిలాగా బాధించే విషయం అనుకుంటే తప్పు. కానీ.. ఆ రకమైన ప్రచారం మాత్రం ప్రజల్లోకి వచ్చేసింది. విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తే, ముస్లింలు బాధపడతారు.. తమ పార్టీకి దూరం అవుతారు అనే ఉద్దేశంతో రాజకీయపార్టీలన్నీ ఈ విషయంలో డ్రామాలు ఆడుతుంటాయి. అదే తరహాలో ఇప్పుడు కూడా ఆ విషయం బయటకు తెచ్చారు.
Must Read ;- గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసీంగ్ రోడ్‌షోలో ఉద్రిక్తత!
బీజేపీ వారి ప్రచార డైలాగులు చూస్తోంటే కొన్ని సందేహాలు కలుగుతున్నాయి..
నగర మునిసిపల్ కార్పొరేషన్ బీజేపీ చేతిలోకి వచ్చినంత మాత్రాన యావత్ తెలంగాణకు సంబంధించిన విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎలా నిర్వహిస్తారు. అది కార్పొరేషన్ కు గానీ, నగర పరిధికి గానీ పరిమితమైన వేడుక కాదు కదా? అనేది తొలి సందేహం.
తెలంగాన విమోచన అనేది.. తెలంగాణ ప్రాంతంలోని అప్పటి ప్రభువు మీద భారత ప్రభుత్వం సాధించిన విజయం. దీనిని విమోచనగా గుర్తిస్తే తెలంగాణ ప్రజలు దానిని సెలబ్రేట్ చేసుకోవాలి. అదే సమయంలో.. విలీనంగా గుర్తిస్తే అది భారతప్రభుత్వ ఘనత గనుక.. కేంద్రమే సెలబ్రేట్ చేసుకోవాలి. బిజెపి గతంలో కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు కూడా రెండోదఫా అధికారంలో ఉంది. తెలంగాణ విమోచన ఘట్టం మీద అంత సెంటిమెంట్ వారికి ఉంటే.. కేంద్రమే ఆ దినోత్సవాన్ని ఏదో ఒక పేరుతో నిర్వహించవచ్చు. కేంద్రం నిర్వహించేలా.. రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవచ్చు. విమోచన దినోత్సవాన్ని రాష్ట్రమంతా నిర్వహించేలా కేంద్రంనుంచి నిధులు కూడా తేవొచ్చు. కానీ.. అలాంటి పని మాత్రం వారికి చేతకాదు. మొక్కుబడిగా ప్రతి సెప్టెంబరుకు ముందు ఆ పేరుతో కాస్త రాద్ధాంతం చేసి తర్వాత మిన్నకుండిపోయే ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే డ్రామా ప్లే చేస్తున్నారు.
తమ మాటలను అంత సులువుగా ప్రజలు ఎలా నమ్ముతారని వారు అనుకుంటున్నారో తెలియదు.
Also Read ;- తొలగింపులు, హెచ్చరింపులు.. తెర మీదకు శాంతి భద్రతల అంశం











