హైదరాబాదు నగర రాజకీయాల్లో మరొక మలుపు చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ అదనపు బలాన్ని సంతరించుకుంటోంది. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రవికుమార్ యాదవ్ లు బీజేపీలో చేరబోతున్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీలోనే ఉండేలా చేయడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేసిన అన్ని రకాల ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
నిజానికి దీనిని శేరిలింగంపల్లి రాజకీయాల్లో పెను సంచలనంగానే భావించాలి. ఆ ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ బలమైన నాయకుడు. వర్గబలం, ప్రజాదరణ రెండూ పుష్కలంగా ఉన్న వ్యక్తిగా పేరుంది. అయితే తాజా రాజకీయ పరిణామాల్లో ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపారు. కొడుకుతో సహా కమలదళంలో చేరడానికి నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. కాంగ్రెస్ నాయకులు కొన్ని రోజులుగా భిక్షపతి యాదవ్ తో విడతలు విడతలుగా చర్చలు జరుపుతూ వచ్చారు. అయితే సానుకూల ఫలితం కనిపించలేదు.
భాజపా వ్యూహకర్త భూపేంద్ర యాదవ్.. బుధవారం నగరానికి వచ్చారు. ఆయన సమక్షంలో కాంగ్రెసు నుంచి భారీగా బీజేపీలోకి చేరికలు ఉంటాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. దానికి ఉదాహరణగా మాజీ మేయర్, గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న బండ కార్తీక రెడ్డి బీజేపీలో చేరారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీకి శేరిలింగంపల్లి ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ రాజీనామా చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గల్లంతు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థాయి నాయకులు రంగంలోకి దిగారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురూ భిక్షపతి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. పార్టీ భవిష్యత్తు బాగుంటుందని, భిక్షపతికి కూడా మంచి ప్రాధాన్యం దక్కుతుందని వారు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఎంత బుజ్జగించినప్పటికీ.. ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దాంతో ముగ్గురు నాయకులు వెను తిరిగారు. బుధవారం సాయంత్రం భూపేంద్రయాదవ్ ను భిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ కలవనున్నారు. బీజేపీ వ్యూహాత్మకంగా నగరంలో బలం పెంచుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Must Read ;- సొంత గూటిలో శత్రువు.. రేవంత్‌కు టచ్‌లో బీజేపీ నేత?
తీగల కూడా ఫిరాయిస్తారా?
మాజీ మేయర్, ప్రస్తుతానికి తెరాసలో ఉన్న తీగల కృష్ణారెడ్డి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ముమ్మరంగా జరుగుతోంది. 2014లో మహేశ్వరం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తీగల 2018 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె కూడా కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరి మంత్రి కూడా అయిపోయారు. దీంతో ఎమ్మెల్యే నియోజకవర్గం కూడా లేకుండాపోయింది. ఎమ్మెల్సీ కావడానికి చాలా ప్రయత్నించారు గానీ.. గులాబీ దళపతి అవకాశం ఇవ్వలేదు.
ఇప్పుడు ఆయన బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నగర బల్దియా ఎన్నికలకు ముందే పార్టీలో చేరి.. ప్రచార బాధ్యతలు చూస్తారని.. వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి నగర పరిధిలోని ఒకచోటనుంచి ఎంపీగా బరిలోకి దిగేలా ఇప్పటినుంచే పార్టీ పనిలో నిమగ్నం అవుతారని ప్రచారం జరుగుతోంది.
Also Read ;- హైదరాబాద్‌లో అడుగుపెట్టిన కమల దళం!