150 డివిజన్లకు జరుగుతున్న ఎన్నికలు. అందులో దాదాపు 50 డివిజన్లలో ఎంఐఎం ప్రాబల్యమే అధికంగా ఉంటుంది. ఇక మిగిలింది కేవలం 100 డివిజన్లు మాత్రమే. ఈ 100 సీట్ల కోసమే ఇప్పుడు రాజకీయ పార్టీల కొట్లాటంతా. ఈ నేపథ్యంలో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రకరకాల స్ట్రాటజీలను ఆయా పార్టీలు ఫాలో అవుతున్నాయి. ఈక్రమంలోనే మాటల దాడులు చేసుకుంటున్నాయి. నేతలు స్వరం పెంచుతున్నారు. ఒకరినొకరు విమర్శించుకునే స్థాయిని పెంచేశారు. నువ్వెంతా అంటే నువ్వెంతా? అనే స్థాయిని కూడా నేతలు ఎప్పుడో దాటిపోయారు. తమ మాటలతో గ్రేటర్ ఎన్నికలకు ఒక యుద్ధవాతావరణాన్ని పులుముతున్నారు.
ఈ గ్రేటర్ ఎన్నికల్లో ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈనేపథ్యంలోనే మొన్న జరిగిన ప్రచార కార్యక్రమంలో బండి సంజయ్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనికి బదులుగా ఎంఐఎం నేత ఒకరు.. బీజేపీ వాళ్లకు బిర్యాని తినిపిస్తామని వ్యాఖ్యలు చేయడం వివాదస్పదమైంది. ఓవైసీ మాటలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే కౌంటరిస్తూ తమ ప్రాంతంలో కొందరు చేసే స్పెషల్ బిర్యానీని వాళ్లకు తినిపిస్తామని చెప్పడం సంచలనం రేపింది.
మరోవైపు బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలను తప్పుబడుతూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కేటీఆర్ ట్విట్టర్‌లో ప్రశ్నించాడు. మీ సహచర ఎంపీ మతిస్థిమితం కోల్పోయినట్లుగా ఇష్టమొచ్చినట్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మీరు సమర్ధిస్తారా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇలా బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ నేతలు పరస్పరం చేసుకున్న ఈ వ్యాఖ్యలు గ్రేటర్ ఎన్నికల్లో రాజకీయ దుమారమే లేపాయి. ఈ లోపే సీన్‌లోకి ఎంఐఎం నేత అక్బరుద్ధీన్ ఓవైసీ ఎంటరై అక్రమ కట్టడాలను కూల్చేసే ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం మరొక పనిచేయాల్సి ఉందనే ఆరోపణ చేశారు. హుస్సేన్ సాగర్ కట్ట మొత్తం ఆక్రమణకు గురైందని, అక్కడ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చివేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అక్బరుద్ధీన్ చేసిన ఈ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటరిస్తూ ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చేస్తాడట.. అరగంటలో దారూసలేంను తమ కార్యకర్తలు కూల్చేస్తారంటూ ఆరోపించారు. అలాగే కేటీఆర్ కూడా అక్బరుద్ధీన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు చోటు లేదని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
అంతటితో ఆగకుండా ఈ నిరసన సెగలు ఎన్టీఆర్, పీవీ ఘాట్ వరకు చేరుకున్నాయి. అక్బరుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ బండి సంజయ్ ఈ రోజు ఎన్టీఆర్, పీవీ ఘాట్‌లను సందర్శించి నివాళులర్పించి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని పేర్కొన్నారు. తెలుగు జాతికి ప్రతీకలుగా ఉన్న నేతల గురించి ఎంఐఎం వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. గ్రేటర్ రాజకీయం ఇలా పాతబస్తీ సర్జికల్ స్ట్రైక్ నుండి ఎన్టీఆర్, పీవీ సమాధుల వరకు చేరుకుంది. ఆరోపణలు-ప్రత్యారోపణల నడుమ పార్టీల మధ్య గ్రేటర్ రాజకీయం వేడెక్కింది.
Must Read ;- ఓట్ల కోసం మాటల యుద్ధం