కొవిడ్ వాక్సిన్ అభివృద్ధి చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఎన్ని వందల కోట్ల రూపాయల వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. వాక్సిన్ కనుగొనడానికి కాగల ఖర్చు వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం కూడా ఉంటుందా? ఇవన్నీ సామాన్యులకు అర్థం కాని ప్రశ్నలు. కొవిడ్ అనే మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేసేసి, మానవాళిని ఎంతగా భయపెట్టిందంటే.. ఖర్చు ఎంతైనా పర్లేదు.. ముందు దానికి ఒక వేక్సిన్ అంటూ కనుగొనబడితే చాలు.. అని ప్రజలు వెర్రెత్తిపోయేంత.
అలాంటి వెర్రి వెర్రి హాట్ హాట్ గా ఉండగానే.. పుణెకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ముందే మేల్కొంది. వేక్సిన్ పరిశోధనలకు అవసరం అన్నట్టుగా నిధులు సమీకరించడానికి తొలినాళ్లలోనే ప్రయత్నాలు ప్రారంభించింది.
కొవిడ్-19కు వేక్సిన్ అభివృద్ధి చేయడానికి సీరమ్ సంస్థ రూ.7,500 కోట్ల రూపాయలు సమీకరించే యోచనతో ఉన్నట్టుగా గత ఏడాది ఆగస్టులోనే వార్తలు వచ్చాయి. నిధుల కోసం బ్లాక్ స్టోన్, కేకేఆర్ వంటి ప్రెవేట్ ఈక్విటీ దిగ్గజాలతో అప్పట్లోనే సీరం సంస్థ చర్చలు ప్రారంభించింది. కేవలం ఈ నిధుల సమీకరణ నిమిత్తం ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ ను ఏర్పాటు చేయాలని కూడా అనుకున్నది. వీటితో పాటు దాతలు, సామాజిక వెంచర్ ఫండ్లతో కూడా అప్పట్లోనే సీరం సంస్థ చర్చలు ప్రారంభించింది. నిధుల సమీకరణ బాధ్యతను గోల్డ్ మన్ శాక్స్, సిటీ, అవెండాస్ వంటి అంతర్జాతీయ ఆర్థిక దిగ్గజాలకు నిధుల సేకరణ బాధ్యత అప్పగించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
Must Read ;- ఏపీలో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత
వారు సొంతంగా అభివృద్ధి చేశారా?
ఇంత భారీగా వేల కోట్ల రూపాయల నిధుల సమీకరణ మీద కన్నేశారు.. వాక్సిన్ కంటె వేగంగా నిధులను రాబట్టడంపై దృష్టి పెట్టారు. ఇంతా కలిపి సీరం సంస్థ సొంతంగా స్వదేశీ వాక్సిన్ ను అభివృద్ధి చేయనేలేదు. ఆస్ట్రాజెనికా-ఆక్స్ ఫర్డ్ వారి భాగస్వామ్యంతో వారు అభివృద్ధి చేసిన టీకాలను వీరు తయారు చేస్తున్నారు. అదే సమయంలో తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా.. అమెరికన్ బయోటెక్ సంస్థ నోవావ్యాక్స్ అభివృద్ధి చేస్తున్న వేక్సిన్ కూడా సీరమ్ ప్లాంట్ లోనే ఉత్పత్తి అవుతుందనేది సమాచారం.
ఈ రెండు వేక్సిన్ ల ఉత్పత్తి సరఫరా కోసం బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి సీరమ్ సంస్థకు 15 కోట్ల డాలర్ల నిధులు అందినట్లుగా ఆగస్టులోనే వార్తలు వచ్చాయి.
వేల వేల కోట్ల రూపాయల నిధులు వెల్లువలా రావడం అంతా ఒక ఎత్తు అయితే.. ఇంతా కలిపి సీరమ్ సంస్థ సొంత టెక్నాలజీ వేక్సిన్ ను అభివృద్ధి చేయడం లేదన్న సంగతిని కూడా గుర్తుంచుకోవాలి.
ప్రభుత్వ నిధులూ వచ్చాయి…
కరోనా వాక్సిన్ ను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీట) దేశంలోని మూడు కంపెనీలకు నిధులు ఇచ్చినట్లుగా కూడా గతంలో వార్తలు వచ్చాయి. దేశంలోని క్యాడిలా హెల్త్ కేర్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లకు నిధులు ఇవ్వనున్నట్లు వార్తలొచ్చాయి. చూడబోతే.. వేక్సిన్ తయారీ ముసుగులో సీరం సంస్థ చాలా పెద్ద నిధుల దందానే నడిపించినట్లుగా ప్రజలు అనుకుంటున్నారు. వేక్సిన్ అభివృద్ధి చేయకుండా, కేవలం తయారీ కే ఇంత దందా నడవడం చిత్రమైన పరిణామంగా పలువురు పేర్కొంటున్నారు.
Also Read ;- ఆక్స్ ఫర్డ్-అస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్ మొదట వేయించుకున్న వ్యక్తి ఎవరో తెలుసా?











