సముద్ర కెరటంలా వేగంగా ముందుకు దూసుకువస్తాడు. ఆ కెరటంలానే మళ్లీ వెనక్కి వెళ్లిపోతున్నాడు. తాననుకున్న లక్ష్యాన్ని మాత్రం తాకలేకపోతున్నాడు. ఎంతో వేగంగా ఎదిగాడు.. అదే రేంజ్‌లో ఎదురుదెబ్బలు తగిలాయి. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. విజయం సాధిస్తున్నా.. ఏదో ఒకటి అడ్డం వస్తూనే ఉంది. ఆ కెరటమే రేవంత్ రెడ్డి. రాజకీయం ఏబీవీపితో మొదలెట్టినా.. ఇండిపెండెంట్‌గా స్థానిక ఎన్నికల్లో గెలిచి.. టీఆర్ఎస్ జెండా పట్టుకున్నా.. ఎక్కువ కాలం నడిచింది తెలుగుదేశంతోనే.
ఓటుకు నోటు కేసుతో గట్టి దెబ్బ..
రాష్ట్రం విడిపోగానే మారిన రాజకీయానికి అనుగుణంగా ఎత్తుగడలు మార్చాలనుకున్నా… అంతలోనే ఓటుకు నోటు కేసుతో గట్టి దెబ్బ తగిలింది. ఇక తన కెరీర్ ఫినిష్ అనుకున్నారంతా.. కాని పార్టీ మార్చి కాంగ్రెస్‌లో చేరి.. కేసీఆర్ కోటను కసిగా ఢీకొట్టాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మల్కాజిగిరి ఎంపీగా గెలిచాడు. అదే కాంగ్రెస్‌లో ఇప్పుడు ఆధిపత్య పోరులో బిజీ అయిపోయాడు. రేపో మాపో పీసీసీ చీఫ్ అంటూ నాలుగు నెలల నుంచి ఊరిస్తూనే ఉన్నారు. అడ్డుపడేవారు అడ్డుపడుతూనే ఉన్నారు. ఇంతలోనే తను నమ్మిన, తాను నమ్ముకున్న కీలక నేతలు బీజేపీలోకి వెళుతున్నారు. ఈ పరిణామాలే ఇప్పుడు రేవంత్ రెడ్డికి మళ్లీ పరీక్ష పెడుతున్నాయి.

కాంగ్రెస్ అధిష్టానం ఓకె అనుకున్నా..
కాంగ్రెస్ అధిష్టానం ఓకె అనుకున్నా.. కాంగ్రెస్‌లోని జన బలం లేని పాత కాపులంతా రేవంత్‌కు అడ్డుపడ్డారు. తెలివిగా అధిష్టానం అభ్యంతరం పెట్టలేని విధంగా పాదయాత్ర చేశాడు. తన బలమేంటో అందరికీ చూపించాడు. కాంగ్రెస్‌లోని సెకండరీ నేతల్లో మెజారిటీ రేవంత్‌కు అండగా నిలబడ్డారు. అయితే అది అయిపోయాక.. కూన శ్రీశైలంగౌడ్ కీలక నేత తనకు ఓపిక లేదంటూ బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు లేటెస్టుగా కొండా విశ్వేశ్వరరెడ్డి మరో కీలక నేత పార్టీకి బై చెప్పేశారు. వీరిద్దరూ రేవంత్‌కు మద్దతు చెప్పినవారే. ఆర్ధిక, అంగబలం ఉన్నవారే. అలాంటి వారు రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ వస్తుందని ఎదురు చూసి చూసి.. చివరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
షర్మిల పార్టీతో..
కాంగ్రెస్‌లో పరిణామాలు ఇలా ఉంటే.. మరోవైపు షర్మిల పార్టీ రేవంత్‌కు మరో సవాల్ విసురుతోంది. రేవంత్‌నే లీడర్‌గా భావిస్తున్న రెడ్డి సామాజికవర్గంలో షర్మిల వైపు డైవర్ట్ అయ్యే ఛాన్స్ కనపడుతోంది. బలమైన నేతలు కాకపోయినా.. కొందరైనా అటు వెళ్లే అవకాశం కనపడుతోంది. ఇది కూడా రేవంత్‌కు ఎదురుదెబ్బే.
కాంగ్రెస్‌తోనే తాననుకున్నది సాధిస్తారా?
మరిప్పుడు రేవంత్ ఏం చేస్తారు? ఈ కాంగ్రెస్‌తో పని కాదనుకుని ఆయన కూడా బీజేపీలోకి వెళ్లిపోతారా? లేక అందరూ చెప్పుకుంటున్నట్లు పీసీసీ చీఫ్ ఆయనకు వస్తే.. మళ్లీ మొదలుకాడ్నించి రాజకీయం మొదలెట్టి.. సత్తా చూపిస్తారా? ఓపిక సహనంతో కాంగ్రెస్‌తోనే తాననుకున్నది సాధిస్తారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీలోకి వెళ్లినా.. రేవంత్‌కు ప్రాధాన్యత అనుకున్నంత దక్కదు కాబట్టి.. కాంగ్రెస్‌లో అయితే ఖచ్చితంగా నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకోవచ్చు కాబట్టి.. అక్కడే ఓపికతో ఎదురు చూసి. తన వ్యూహాన్ని అమలు చేస్తారని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
Must Read ;- రేవంత్ సభకు.. కొందరు సీనియర్ల హ్యాండ్











