ఏపీ తెలంగాణ సరిహద్దుల వద్ద ఇవాళ మరల పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో వస్తున్న వేలాది మందిని రామాపురం చెక్ పోస్టు వద్దే పోలీసులు నిలిపి వేశారు. దీంతో కిలోమీటర్ల మీర వాహనాలు నిలిచిపోయాయి. పాస్ ఉంటేనే సరిహద్దు దాటాల్సి ఉంటుందని తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పడంతో అనేక మంది వెనుతిరిగి హైదరాబాద్ వెళ్లి పోతున్నారు. వీకెండ్ కావడంతో ఏపీకి చెందిన వేలాది మంది ఉదయం 9 గంటలకే రామాపురం చెక్ పోస్టు వద్దకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి పెద్ద ఎత్తున కార్లు రావడంతో తెలంగాణ పోలీసులు నిలిపి వేశారు. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న వారిని కూడా అనుమతించడం లేదు. ముందుగా తెలంగాణ పోలీస్ కమిషనరేట్ నుంచి పాస్ పొందిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అయినా తెలంగాణ పోలీసులు పాస్ లేని వారిని అనుమతించడం లేదు.
కరోనా తగ్గినా వదలరా?
తెలంగాణలో రోజు వారీ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. యాక్టివ్ కేసులు కూడా 16 వేలు మించి లేవు. అయినా పొరుగు రాష్ట్రాల నుంచి వాహనాలను అనుమతించక పోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేసుకుంటూ వారాంతంలో సొంత గ్రామాలకు వెళ్లాలనుకున్న వారికి తిప్పలు తప్పడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య లాక్ డౌన్ లేని సమయంలో వాహనాలను అనుమతించాలని జనం కోరుతున్నారు. ప్రజలు సరిహద్దుల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చోద్యం చూస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
MUST READ ;- ఆ ఏడు చోట్ల లాక్డౌన్ యథాతథం











