మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా వచ్చింది ఏమైనా ఉందంటే, అది సినిమా ప్రకటన మాత్రమే. అఫీషియల్ గా ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశారు. సర్కారువారి పాట తర్వాత సెట్స్ పైకి వస్తుందని ప్రకటించారు. అంతే.. అంతకుమించి ఒక్క ముక్క కూడా ఎక్స్ ట్రా చెప్పలేదు.
మిగతావన్నీ పుకార్లే, స్పైసీ కథనాలే. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో రోజుకో రూమర్, వారానికి ఊహాగానం అన్నట్టు తయారైంది. ఈ ప్రాజెక్టు ప్రకటించిన వెంటనే తెరపైకొచ్చిన పేరు పూజా హెగ్డే. ఈ పుకారు పుట్టడానికి సహేతుకమైన కారణాలే ఉన్నాయి. అవేంటంటే.. ఈమధ్య పూజా హెగ్డేకు బాగా కనెక్ట్ అయ్యాడు త్రివిక్రమ్. అరవింద సమేత నుంచి ఆమె వర్క్ ను త్రివిక్రమ్ ఇష్టపడుతున్నాడు. పైగా సొంత డబ్బింగ్ చెప్పుకోవడంతో పూజా, త్రివిక్రమ్ కు మరింత నచ్చేసింది. ఆ వెంటనే అల వైకుంఠపురములో సినిమాతో మరోసారి పూజా హెగ్డేను రిపీట్ చేశాడు. ఈసారి కూడా ఆమె బాగా ఎట్రాక్ట్ చేసింది.
సో.. ఈ ఫ్యాక్టర్స్ వల్ల త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా ఉండొచ్చని అంతా భావించారు. అవే రాశారు. అందులో తప్పులేదు కూడా. అయితే అంతలోనే సడెన్ గా జాన్వీ కపూర్ పేరు తెరపైకొచ్చింది. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ పేరు తెరపైకి రావడానికి పెద్దగా కారణాల్లేవ్. ఎప్పుడు పడితే అప్పుడు జాన్వి పేరు టాలీవుడ్ లో వినిపిస్తుంటుంది. ఇంకా చెప్పాలంటే ఓ పెద్ద సినిమా ప్రకటించిన వెంటనే, దానికి జాన్వీ పేరును ఎటాచ్ చేస్తూ పుకార్లు పుట్టించే బ్యాచ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు కూడా అదే పనిచేశారు. శ్రీదేవి కూతురిగా టాలీవుడ్ లో జాన్వికి మంచి ఇమేజ్ ఉంది. ఆమె టాలీవుడ్ లో అడుగుపెడితే సినిమాకు మైలేజీ కూడా బాగుంటుంది. కానీ జాన్వీకి ఇప్పట్లో సౌత్ కొచ్చే ఆలోచన లేదు. జాన్వీకే కాదు, ఏ ముద్దుగుమ్మకైనా బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తుంటే, సౌత్ వైపు చూడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి జాన్వి కూడా ప్రస్తుతానికి పెండింగ్ లిస్ట్ లోనే. ఈ పుకార్లు కేవలం ఈ ఇద్దరితో ఆగితే బాగుండేది. తాజాగా మాళవిక మోహనన్ పేరు తెరపైకొచ్చింది.
ఇది మరీ నమ్మశక్యం కాని పుకారు. పూజా హెగ్డే పేరు తెరపైకి రావడానికి, జాన్వి కపూర్ పేరు వినిపించడానికి వ్యాలీడ్ రీజన్స్ ఉన్నాయి. కానీ మాళవిక మోహనన్ పేరు బయటకు రావడానికి మాత్రం పెద్దగా రీజన్స్ కనిపించడం లేదు. ఆమె స్టార్ హీరోయిన్ కాదు. రీసెంట్ గా విజయ్ సరసన మాస్టర్ సినిమాలో మాత్రమే నటించింది. అందులో కూడా ఆమె పాత్రకు పెద్దగా పేరు రాలేదు.
ఇలాంటి హీరోయిన్ పేరు మహేష్-త్రివిక్రమ్ లాంటి భారీ ప్రాజెక్టులో వినిపించడం కాస్త ఆశ్చర్యమే. అయితే తన సినిమాల్లో సెకెండ్ లీడ్ ఫిమేల్ రోల్స్ కు కూడా స్టార్ హీరోయిన్లను తీసుకోవడం త్రివిక్రమ్ స్టయిల్. బహుశా మహేష్ సినిమాలో మాళవికను సెకెండ్ హీరోయిన్ గా పరిశీలిస్తున్నాడేమో. ప్రస్తుతానికైతే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ లేవు. మరికొన్ని రోజులు అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే, సర్కారువారి పాట హంగామా నడుస్తోందిప్పుడు.
Must Read ;- బుర్రిపాలెం ప్రజలకు మహేష్ బాబు టీకాలు











