Rahul Gandhi Is New Congress Leader In Lok Sabha :
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందన్న వాదనలను ఇకపై మనం వినలేమేమో. ఎందుకంటే.. ఆ పార్టీకి ఏమాత్రం పూర్వ వైభవం తీసుకురాలేని నేతగా ముద్ర వేయించుకున్న రాహుల్ గాంధీ.. ఆ పార్టీ తరఫున కదన రంగంలోకి దిగబోతున్నారట. పార్లమెంటు దిగువ సభ లోక్ సభలో ఆ పార్టీ పక్ష (కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత) పదవిని తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారట. ఈ నెల 19న పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో రాహుల్ ఈ పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమైపోవడంతో ఇక పార్లమెంటులో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధమే జరగనుందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఓటమితో సన్యాసం..
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చే దిశగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని బృందం తమదైన శైలిలో కృషి చేసింది. అయితే తన సొంత నియోజకవర్గం అమేథీలో స్వయంగా రాహుల్ కు ఓటమి ఎదురుకావడంతో ఆయన తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలను వదిలేసి ఓ రకమైన డైలమాలోకి వెళ్లీపోయారు. అయితే ఎందుకో గానీ.. కేరళలోని వయనాడ్ లోనూ బరిలోకి దిగిన రాహుల్.. అక్కడ గెలవడంతో పార్లమెంటులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు అయ్యింది. లేదంటే.. రాహుల్ కు ఈ దఫా లోక్ సభలోకే ఎంట్రీ దక్కేది కాదు. ఈ విపరిణామాలన్నింటితో బెంబేలెత్తిపోయిన రాహుల్.. పార్టీ పదవులను వదిలేశారు. అయితే పార్టీ యువరాజుగా ఉన్న నేతే పార్టీ పగ్గాలను కింద పడేస్తే ఎలాగన్న రీతిలో పార్టీ నేతలు ఎంత చెప్పినా కూడా రాహుల్ వినలేదనే చెప్పాలి.
సరైన సమయంలో సరైన నిర్ణయం..
అయితే ఇప్పుడు మోదీపై దేశవ్యాప్తంగా ఓ రకమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విపక్షం గట్టిగా వ్యూహ రచన చేస్తే మోదీ ఓడిపోవడం ఖాయమన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అదే సమయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ కు దగ్గరవడం, పార్టీ వ్యూహరచనను ఇప్పటికే తన చేతిలోకి తీసుకోవడంతో.. కాంగ్రెస్ లో ఒకింత జోష్ కనిపిస్తోందనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో రెండు రోజుల క్రితం రాహుల్ తో పాటు సోనియా, ప్రియాంకలతో భేటీ అయిన పీకే.. పలు కీలక అంశాలపై సుధీర్ఘ మంతనాలు సాగించారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ మరోమారు యాక్టివ్ కావాల్సిన అవసరాన్ని కూడా పీకే ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం లోక్ సభలో పార్టీ నేతగా ఉన్న ఆధిర్ రంజన్ చౌదరి పెద్దగా రాణిస్తున్న దాఖలా ఏమీ కనిపించలేదు. దీంతో ఆయనను తప్పించేందుకు ఇప్పటికే నిర్ణయం జరిగిపోగా.. ఆ పదవిలో వేరే ఎవరినో నియమంచడం ఎందుకు? స్వయంగా రాహులే దిగితే బాగుంటుందని పీకే చెప్పారట. సరైన సమయంలో ఈ ప్రతిపాదన రావడంతో రాహుల్ కూడా వెనువెంటనే ఒప్పేసుకున్నారట. మరి లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేతగా రాహుల్ బరిలోకి దిగితే.. రానున్న పార్లమెంటు సమావేశాలు రసవత్తరంగానే సాగనున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- కాంగ్రెస్ లోకి పీకే?.. మోదీకి కష్టమేనా?











