తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక డైలీ సీరియల్‌గా సాగిపోతోంది. గ్రేటర్ ఫలితాల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తం రాజీనామా చేసిన తరువాత ఆ సీటులో తాత్కాలికంగా ఆయనే కొనసాగుతున్నారు. అయితే వీలైనంత త్వరగా కొత్త చీఫ్‌ను నియమించాలని అధిష్టానం భివిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో నేతలందరితో సంప్రదింపులు జరిపారు. సీల్డ్ కవర్‌లో రిపోర్టును రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మణిక్కం ఠాకూర్ ఢిల్లీకి తీసుకు వెళ్ళారు. అయితే ఆయన రిపోర్టును ఇంకా అధిష్టానానికి పంపించలేదని తెలుస్తోంది.
ఢిల్లీ స్థాయిలో కూడా పైరవీలు..
రాష్ట్రంలో అభిప్రాయ సేకరణపై సంతృప్తి చెందని ముఖ్యనేతలు ఢిల్లీలో సోనియా , రాహుల్‌లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బట్టి, మధుయాష్కి వంటి నేతలు నేరుగా సోనియా గాంధీని కలిసినట్టు సమాచారం. అయితే వీరిలో ఎవరికైనా పీసీసీ పదవి దక్కుతుందా లేక కొత్తవారికి ఇస్తుందా అన్నది చూడాలి. తమకే పీసీసీ ఇవ్వాలంటూ పాత నేతలంతా కోరుతుంటే .. తనకే పీసీసీ కన్ఫాం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్‌కు పీసీసీ ఇవ్వకూడదంటూ పార్టీ సీనియర్లు అధిష్టానానికి రాసినట్టుగా ఓ లేఖను కూడా మీడియాకు రిలీజ్ చేశారు. అయితే, ఈ లేఖలో వాస్తవాలు ఏమిటన్నది తేలాల్సి ఉంది. డైలీ సీరియల్‌లా సాగుతున్న పీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియకు ముహూర్తం ఎప్పడన్నది నేతలకు అంతు చిక్కడం లేదు.
Must Read ;- రేవంత్: ఆశపుట్టిన ప్రతిసారీ.. ఆరోపణలు పుడుతున్నాయ్!
25న ముహూర్తం అంటున్న నేతలు..
అధ్యక్షుని నియమాకం ఈ నెల 25న ఫైనల్ చేస్తారని పార్టీలో చర్చ నడుస్తోంది. ఆ రోజు వైకుంఠ ఏకాదశి కావడంతో మంచి రోజన్న నమ్మకంతో అదే రోజు కొత్త అధ్యక్షుడిని ప్రకటించ వచ్చని భావిస్తున్నారు. కొత్త అధ్యక్షుడిని నియమించడంతో కాంగ్రెస్ పార్టీ తన పాత పద్ధతినే ఫాలో అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఏ విషయాన్నైనా నాన్చి గాని తేల్చదు కాంగ్రెస్ అదిష్టానం. తన నిర్ణయం వెలువరించే సమయానికి నేతల మధ్య పోటీ కాస్త తగ్గడం, మొదట ఉన్నంత ఆవేశం ఉండక పోవడంతో వ్యతిరేకత కాస్త తగ్గించడం ఆ పార్టీకి మొదటి నుండి వస్తున్న అలవాటు . అయితే ఆ ఫార్ములా ఈ సారి వర్కౌట్ అవుతుందా, లేదా.. ముఖ్యనేతలు తమ మాటలకే కట్టబడి పీసీసీ పేరు ప్రకటించిన తరువాత పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం మేరకు రోడ్డున పడతారో చూడాలి.
Also Read ;- కమలదళంలోకి కాంగ్రెస్ నేతలు ఎవరెవరు?