తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం నాయకుల మధ్య పోరు మొదలైంది. తామంటే తామే పీసీసీ అధ్యక్షులమంటూ ముఖ్యనేతలు చెప్పుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటమి అనంతరం ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో వీరంతా ఢిల్లీలో తమ లాబీయింగ్‌కు తెరలేపారు. తానే ఇక బాస్ అంటూ అందరూ చెబుతూ తిరుగుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి,శ్రీధర్‌బాబు, వీహెచ్ వంటి నేతలు తమకే పీసీసీ పీఠం దక్కబోతోందంటూ చెప్పుకుంటున్నారు. ఇక రేవంత్‌రెడ్డి ఓ అడుగు ముందుకు వేసి ఇక తనవైపే అధిష్టానం చూస్తోందని, ఇక ప్రకటనే తరువాయి అని అంటున్నారు.
దూకుడు పెంచిన రేవంత్
తెలంగాణ కాంగ్రెస్‌లో తన కంటే ఇంకెవరూ సమర్దులు లేరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. గ్రేటర్ ఎన్నికల్లో రేవంత్ , బట్టి ఇలా ఒక్కరిద్దరు నేతలు మినహా ఎవరూ ప్రచారంలో కనిపించలేదు. రేవంత్ నగరం మొత్తం సుడిగాలి పర్యటన చేశారు. ప్రభుత్వం, బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయన సభలకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ఉత్సాహం రెట్టింపైంది. తాను తప్ప పార్టీని మరెవరూ బయట పడేయలేరన్న అభిప్రాయంతో ఆయన ప్రచారం నిర్వహించుకున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. జాతీయ నాయకత్వం తన పేరు ప్రకటించేందుకు సిద్ధంగా ఉందని .. 9వ తారీఖున ప్రకటన వస్తుందని కూడా ప్రచారం సాగింది. అయితే ఇదంతా రేవంత్ జిమ్మిక్కులో భాగమే అంటున్నారు ఆ పార్టీ నేతలు. అంత ఈజీగా ఓ రాష్ట్ర అధ్యక్షుడిని కాంగ్రెస్ నియమించదని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.

Must Read ;- కార్యకర్తలలో ధైర్యాన్ని నింపిన రేవంత్ రెడ్డి
ముందు రేవంతే అనుకున్నా ..
రేవంత్‌కు అధ్యక్ష పీఠం ఖాయం అని నిన్నటి వరకు ప్రచారం సాగింది. ఆయనపై అధిష్టానం కూడ భారీగా నమ్మకం పెట్టుకుంది. రాహుల్ గాంధీతో పాటు , ముఖ్యనేతలందరితోనూ ఆయనకు సన్నిహిత సబంధాలు ఉన్నాయి. దీంతో ప్రకటన రావడమే తరువాయి అని భావించారు. అయితే అనూహ్యంగా పార్టీ అధిష్టానం అభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు పార్టీ సీనియర్ నేతల లాబియింగ్ పని చేసిందన్న ప్రచారం సాగుతోంది. మొదటి నుండే ఆయన అధిష్టానాన్ని దిక్కరించి తానే అధ్యక్షుడిగా ప్రచారం చేసుకుంటే పార్టీ పరువు పోతుందన్న అభిప్రాయం వారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల వద్ద వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక రేవంత్‌కు పీసీసీ పదవి కట్టబెడితే కాంగ్రెస్ పార్టీలో నేతలెవరూ మిగలరని..అంతా వలస పోతారంటూ కూడా రాష్ట్ర పెద్దలు జాతీయ నాయకులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక రేవంత్ అధ్యక్ష పీఠం ప్రచారం విస్తృతంగా జరగడం .. దానిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర నాయకులు ఏకం కావడంతో ప్రకటన వాయిదా వేసి అభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో తనకే అధ్యక్ష పీఠం దక్కుతుందని బాగా ప్రచారం చేయడం ద్వారా పీఠం ఖాయమనుకుంటే ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో అధిష్టానం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న టెన్షన్‌లో ఆయన ఉన్నట్టు రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు.
Also Read ;- కమలదళంలోకి కాంగ్రెస్ నేతలు ఎవరెవరు?











