తెలుగులో ఎన్ని న్యూస్ ఛానెళ్లు ఉన్నా.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉందనే చెప్పాలి. తెలుగు దేశం పార్టీకి అనుకూలమైన ఛానెల్ గా ముద్రపడినా.. తనదైన శైలి విశ్లేషణలు చేయడంలో ఏబీఎన్‌ది ఓ విభిన్నమైన నేపథ్యమేనని చెప్పాలి. ఈ ఛానెల్‌లో ప్రసారమవుతున్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పేరిట ప్రసారమయ్యే ప్రత్యేక ఇంటర్వ్యూ అంటే వీక్షకులకు మహదానందమేనని కూడా చెప్పాలి. ఈ కార్యక్రమంలో ఏబీఎన్ ఎండీగా ఉన్న వేమూరి రాధాకృష్ణ స్వయంగా జర్నలిస్టు అవతారం ఎత్తి ఆయన సంధించే ప్రశ్నలు చూస్తే.. .. ఇంటర్వ్యూకు వచ్చే వారు తల్లఢిల్లిపోతున్న వైనం కూడా అమితాసక్తి రేకెత్తించేదే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి రెండు సీజన్‌లు ముగియగా.. ఇటీవలే ప్రారంభమైన మూడో సీజన్ తొలి ఇంటర్వ్యూలో ఆర్కే మార్కు ప్రశ్నలు రాలేదనే భావన వినిపించింది. అయితే ఆ భావనను ఆర్కే.. తన రెండో ఇంటర్వ్యూలోనే పటాపంచలు చేశారు. రెండో ఇంటర్వ్యూకు వచ్చిన ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు ఆర్కే సంధించిన ప్రశ్నలు చూస్తుంటే.. నిజంగానే నవ్వుతూనే నరాలు తెంచేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
చెక్కు చెదరని నవ్వుతోనే..
ఆదివారం రాత్రి ప్రసారమైన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో సినీ నటుడుగానే కాకుండా వైసీపీ నేతగా, ఏపీ సీఎం జగన్ ఫ్యామిలీ వియ్యంకుడిగా జనాలకు చిరపరచితమైన మంచు మోహన్ బాబు కనిపించనున్నారనగానే అందరూ దీనిపై ఆసక్తి కనబరచారు. అంతేకాకుండా గతంలో మోహన్ బాబుతో ఆర్కే నిర్వహించిన రెండు ఇంటర్వ్యూలను కూడా ఈ సందర్భంగా జనం గుర్తు చేసుకున్నారు. రెండు పాత ఇంటర్వ్యూలలో ఆర్కేపై మోహన్ బాబుదే పైచేయి అన్నట్లుగా సాగిన తీరును కూడా జ్ఞాపకం చేసుకున్నారు. అయితే ఆదివారం ప్రసారమైన ఇంటర్వ్యూలో మాత్రం మోహన్ బాబుకు ఆర్కే ముచ్చెమటలు పట్టించారు. ఇంటర్వ్యూ ఆద్యంతం నవ్వుతూ తుళ్లుతూ ప్రశ్నలు సంధించిన ఆర్కే.. మోహన్ బాబు చేత సమాధానాలు కూడా రాబట్టారు. ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలేనని మోహన్ బాబు చేతనే ఆర్కే చెప్పించిన వైనం హైలెట్‌గా నిలిచింది. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవితో విభేదాలు, ప్రస్తుతం మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ బలపరచిన ప్యానెల్‌కు నేతృత్వం వహిస్తున్న ప్రకాశ్ రాజ్‌పై మోహన్ బాబు వైఖరి ఏమిటన్న విషయాన్ని కూడా ఆర్కే రాబట్టగలిగారు.
ఇబ్బంది పెట్టొద్దని మాట ఇచ్చినా..
గత ఇంటర్వ్యూల నేపథ్యంలో ఆర్కే తనను ఏ మేర ఇబ్బంది పెడతారోనని భయపడి.. తనను ఇబ్బంది పెట్టే ప్రశ్నలేయరాదని మరీ ముందే హామీ తీసుకున్నాకే మోహన్ బాబు ఇంటర్వ్యూకి వచ్చినట్టుగా ఆయనే ఒప్పేసుకునేలా ఆర్కే వ్యవహరించిన తీరుపై కూడా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తాను సంధించిన ప్రశ్నలకు మోహన్ బాబు ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించగానే.. ఆ ప్రశ్నను డైవర్ట్ చేసి.. ఆ తర్వాతెప్పుడో ఇంకో మార్గం ద్వారా అదే ప్రశ్నకు మోహన్ బాబు నుంచి ఆర్కే సమాధానం రాబట్టిన వైనం కూడా ఆసక్తి కలిగిస్తోంది. అంతేకాకుండా తన వాళ్లనుకున్న వారు తప్పులు చేస్తే.. వాటిని అధికారులపైకి నెట్టేస్తూ మోహన్ బాబు వ్యవహరించిన తీరు కూడా బాగా ఎలివేట్ అయ్యేలా ఆర్కే తనదైన మార్కును చూపారు. ఇక జీవితంలో ఆటుపోట్లు తప్పవని, వాటన్నింటినీ అనుభవించానని మోహన్ బాబు ఓ రకమైన ఆధ్యాత్మిక భావనలోకి వెళ్లిపోయి మరీ సమాధానాలు చెప్పిన తీరుపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పడుతున్న సెటైర్లు వైరల్ అవుతున్నాయి. చావగొట్టి చెవులు మూశారు అంటూ ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ అయితే పేలిపోయిందనే చెప్పాలి. మొత్తంగా మూడో సీజన్ రెండో ఇంటర్వ్యూలోనే ఆర్కే మళ్లీ తన స్టామినాను నిరూపించుకున్న వైనంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Must Read ;- సాయిరెడ్డికి నో మోర్ ఛాన్స్











