2019 ఎన్నికలకు ముందు సుధీర్ఘ పాదయాత్ర చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాను అధికారంలోకి వస్తే.. రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని నమ్మబలికారు. జనం కూడా ఆయన మాట నిజమేనేమోనని నమ్మారు. వైసీపీ అభ్యర్థులు ఎవరన్న విషయాన్ని పక్కనపెట్టేసి జగన్ పార్టీకి ఓట్లన్నీ గుద్దేశారు. జగన్ అడిగిన మేరకే జనం వైసీపీకి అధికారం కట్టబెట్టారు. అయితే జగన్ జనానికి ఇచ్చిన మాటను మాత్రం మరిచారు. రాజన్న రాజ్యం తీసుకొస్తానని నాడు ప్రకటించిన జగన్.. రాష్ట్రంలో అవినీతి పాలనకు తెర తీశారు. దీనిపై చాలా రోజుల నుంచే విపక్ష టీడీపీ గంతెత్తి మరీ అరుస్తోంది. జనం కూడా వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని జగన్ పాలనపై టీడీపీ చెప్పిన మాట నిజమేనని నిర్ధారించుకున్నారు. అయితే ఈ మాటను వైసీపీనే అర్థం చేసుకోలేకపోతోంది. అయితే క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందన్న విషయాన్ని సాక్షాత్తు వైసీపీ నేత, నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఈ మాట నిజేనని తేల్చి పారేశారు. జగన్ పాలనలో లంచం లేకుండా ఏ పనీ జరగడం లేదని, అందుకు నిదర్శనం తన సొంతూరేనని నల్లపురెడ్డి బల్ల గుద్ది మరీ చెప్పేశారు.
ప్రసన్న ఆవేదన ఇది..
నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సొంతూరు మాత్రం పొరుగునే ఉన్న గూడురు నియోజకవర్గం పరిధిలోని కోట మండలంలో ఉండి. ఈ గ్రామంలో ఇటీవలే జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన గూడూరు నుంచి తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అయితే కొవ్వూరు ఎమ్మెల్యేగా ప్రసన్న ఉన్నా.. గూడూరు నియోజకవర్గ ఇంచార్జీగా ప్రసన్న కుటుంబానికి చెందిన వారే వ్యవహరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి సొంతూళ్లో ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓడిపోవడం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. అదే సమయంలో ఇటీవల తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కోటలో వైసీపీ కంటే టీడీపీ అభ్యర్థికి ఏకంగా 30 ఓట్ల మెజారిటీ రావడం, ఈ విషయాన్ని స్వయంగా జగన్ తనవద్ద ప్రస్తావించిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. తన పరిధి కాకపోయినా.. తన సొంతూరు కదా అన్న భావనతో కోటలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఓటమికి గల కారణాలేమిటని ప్రసన్న ఆరా తీశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు జనాన్ని జలగల్లా పీడిస్తున్న వైనం ఆయన దృష్టికి వచ్చింది. అదే సమయంలో నల్లపురెడ్డి కోటకు బీటలు వారాయని మీడియా కూడా పతాక శీర్షికలు పెట్టి వార్తలు కుమ్మేసింది. దీంతో ఇలాగే సైలెంట్ గా ఉండే ఇబ్బందేనని గ్రహించిన ప్రసన్న సోమవారం నాడు కోటకు వచ్చారు. పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన గూడురు పార్టీకి చెందిన కీలక నేతలను హెచ్చరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తోలు తీస్తా.. తాట వలుస్తా..
ఈ సందర్భంగా గూడురుకు చెందిన పార్టీ కీలక నేతలను నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షనావళిని దాటిన వారు ఎంతటివారైనా వదిలేదని లేదని, పార్టీ నుంచి వారిని బయటకు తరిమేస్తానని ఆయన వార్నింగ్‌లు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న ఏమన్నారంటే.. ‘‘కోట పంచాయతీలో ఏ పని జరగలన్నా వైసీపీ నాయకులు లంచాలు తీసుకుంటున్నారు. ఓపినింగ్ కి పిలిస్తే డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి? కొందరు వైసీపీ నేతల వల్ల నా కుటుంబం పరువు పోతుంది. మా కంచు కోట అయిన కోట మండలంలో నాయకులని కలుస్తా. సొంత మనుషులు ఇతర పార్టీల్లోకి వెళ్లడం దురదృష్టకరం. ప్రతి పనికి ఇంత అని వసూలు చేస్తున్నారు. రూ.5 వేల నుంచి లక్ష, రూ.2 లక్షల వరకూ లంచాలు తీసుకుంటున్నారు. ఇలాంటి వారి వల్లే పార్టీ పరువు పోతోంది. ఇకపై ఈ దందా కుదరదు. ఈ దందాను తక్షణమే నిలిపేయాలి. లేదంటే తాట తీస్తా. తోలు తీస్తా. అవినీతికి పాల్పడుతున్న వారు ఎంతటివారైనా.. పార్టీ నుంచి బహిష్కరిస్తా. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి’’ అని నల్లపురెడ్డి హెచ్చరించారు.
అంతటా ఇదే తంతు
విపక్ష హోదాలో ఉన్న టీడీపీ జగన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం నిజమే కదా అన్న భావనతోనే జనం అంతగా పట్టించుకోలేదు. అంతేకాకుండా తమ గ్రామాల్లోనూ ఈ తరహాలో అక్కడక్కడా వైసీపీ నేతలు దందాలు చేస్తున్నా.. రాజకీయాలన్నాక ఇది సర్వ సాధారణమే అనుకున్నారు. అయితే వరుసబెట్టి ధరలను పెంచుతూ పోవడం, పింఛన్లు కట్ చేయడం, రేషన్ కార్డుల కోతలపై దృష్టి పెట్టడంతో జగన్ పాలనపై జనం మరింత లోతుగా పరిశీలన చేయడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే జనానికి వైసీపీ నేతల చేతివాటం కనిపించింది. దానిని ప్రశ్నిస్తే.. బెదిరింపులు ఎదురయ్యాయి. చేసేది లేక జనం మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అంటూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. తన సొంత పార్టీ నేతలు సాగిస్తున్న దందాను బయటపెట్టడం సంచలనంగా మారింది.
Must Read ;- జగన్ అభివృద్ధి ముమ్మాటికీ జీరోనే