బాలీవుడ్ లో హీరోయిన్ గా ఛాన్స్ రావడం అంత తేలికైన విషయమేం కాదు. ఒకవేళ అదృష్టం కొద్దీ అవకాశం వచ్చినా, అది బ్లాక్ బస్టర్ హిట్ కావడం కూడా సాధారణమైన విషయమేం కాదు. కానీ ఆ రెండు విషయాలు భాగ్యశ్రీ విషయంలో అవలీలగా జరిగిపోయాయి. ‘మైనే ప్యార్ కియా’ సినిమాతో బాలీవుడ్ తెరకి ఆమె పరిచయమయ్యారు. సల్మాన్ ఖాన్ జోడీగా ఆమె తెరపై మెరిశారు. ఆమె అందం .. నవ్వు ప్రేక్షకులను సమ్మోహితులను చేశాయి. ఆ సినిమా విడుదలైన తరువాత భారతదేశంలో ఆమె గురించి మాట్లాడని నోరుగానీ .. ఊరుగాని లేదంటే అతిశయోక్తి కాదు.
అయితే ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ కేటగిరీలోకి చేరిపోయినప్పటికీ ఆమె పెద్దగా హడావిడి చేయలేదు. తన క్రేజ్ ను పారితోషికంగా మార్చుకోవడానికి ట్రై చేయలేదు. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ వినిపించుకోకుండా ఆమె పెళ్లి చేసుకుని, ఇల్లాలి బాధ్యతలు స్వీకరించడం పట్లనే ఇంట్రెస్ట్ చూపారు. ఆ తరువాత ఏదో కాలక్షేపం కోసమన్నట్టుగా కొన్ని సినిమాల్లో మాత్రం నటించారు. అలా తెలుగులో రాజశేఖర్ ‘ఓంకారం’లోను .. బాలకృష్ణ ‘రాణా’ సినిమాలోను కీలకమైన పాత్రలను పోషించారు. కాలం మారుతున్నా వేకువ .. వెన్నెల ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తాయన్నట్టుగా, భాగ్యశ్రీ కూడా ఇప్పటికీ అదే గ్లామర్ తో ఆశ్చర్యపరుస్తున్నారు.
అలాంటి భాగ్యశ్రీ .. ప్రభాస్ తాజా చిత్రమైన ‘రాధేశ్యామ్‘ సినిమాలో ఆయనకి తల్లి పాత్రలో కనిపించనున్నారనే టాక్ వచ్చింది. నిజంగానే ఆమె ఆ పాత్రను పోషిస్తుందనే విషయం ఆమె స్వయంగా చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తాను ప్రభాస్ తల్లిగా నటిస్తున్నట్టుగా మాట నిజమేనని అన్నారు. కథలో తన పాత్రకి ఎంతో ప్రాధాన్యత ఉందనీ, అందువల్లనే అంగీకరించానని చెప్పారు. దర్శకుడు రాధాకృష్ణకుమార్ తన పాత్రను చాలా గొప్పగా డిజైన్ చేశారని అన్నారు. ప్రభాస్ తో కలిసి నటించడం ఆనందంగా ఉందనీ, చాలాకాలం తరువాత తెలుగులో చేయడం కూడా సంతోషాన్ని ఇస్తోందని చెప్పుకొచ్చారు.
Must Read ;- ప్రభాస్ ‘సలార్’ లో నైఫ్ లాంటి హీరోయిన్.. ?











