వలసల జిల్లాగా పేరున్న మహబూబ్ నగర్ ను అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారుస్తున్నామని తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దేశంలోనే తొలి ఏరో స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ మహబూబ్ నగర్ లో నెలకొల్పనున్నట్టు ప్రకటించారు. కర్వెన, ఉదండాపూర్ జలాశయాల మధ్య సుమారు 15 ఎకరాల స్థలంలో శిక్షణ కేంద్రం ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.
రూ. వెయ్యి కోట్లతో..
మహబూబ్ నగర్ స్టేడియంలో జాతీయ పారామోటార్ ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా హైదరాబాద్‌కు దీటుగా దినదినాభివృద్ధి చెందుతోందని, త్వరలో రూ. 1,000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. మహబూబ్ నగర్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్‌కు సమీపంలో శిల్పారామం పనులు ప్రారంభిస్తామని, సుమారు రూ. 10 కోట్లతో హీట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తామన్నారు.
వలస జిల్లాగా పేరొందిన మహబూబ్‌నగర్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ నిర్వహించడం సంతోషంగా ఉంది. భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఎయిర్ షో, పారామోటార్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించడం సంతోషకరం. గతేడాది కైట్ ఫెస్టివల్‌ను నిర్వహించాం. అన్ని రంగాల్లో పాలమూరు జిల్లా అభివృద్ధి చెందుతోంది. త్వరలోనే అతిపెద్ద పరిశ్రమ మహబూబ్‌నగర్ జిల్లాకు రాబోతోంది. దేశంలోనే తొలి ఏరో స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను జిల్లాలో ఏర్పాటు చేస్తాం.











