తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్ర, శనివారాల్లో ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైందని, ప్రధాని అపాయింట్‌మెంట్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ తోపాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. దీంతో పాటు ఢిల్లీలో పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ భవన్‌కు కేంద్రం స్థలం కేటాయించిన విషయం తెలిసిందే.
అపాయింట్‌మెంట్ కోరలేదా..
ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రధాని అపాయింట్‌మెంట్ విషయంపై ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రధాని అపాయింటమెంట్ తెలంగాణ సీఎం కోరలేదని, ఈ నేపథ్యంలో ప్రధానిని కలిసే అవకాశం లేదని కొందరు చెబుతుండగా, అపాయింట్‌మెంట్ కోరారని, ఇంకా కనఫర్మ్ కావాల్సి ఉందని మరి కొందరు చెబుతున్నారు. మొత్తానికి ప్రధాని మోడీతో భేటీ ఉందా లేదా అనే అంశంపై క్లారిటీ లేదు.
ఇటీవల ప్రధాని మోడీ కొవిడ్ వ్యాక్సిన్ పరిశోధన పురోగతిపై సమీక్షించేందుకు హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్‌ను సందర్శించారు. ఈ టూర్‌లో సీఎంకు ఆహ్వానం అందలేదు. ఇతర ఎంపీలకూ అందలేదు. ఇందుకు షార్ట్ షెడ్యూలే కారణమని బీజేపీ చెబుతోంది.
Must Read ;- ఉత్తర తెలంగాణలో పట్టుకు బీజేపీ ప్లాన్.. వరంగల్‌పై దృష్టి
ఉప్పు..నిప్పులా మారి
ఇక దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత టీఆర్ఎస్‌కి, బీజేపీకి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే వాతావరణం ఉంది. పార్టీల నాయకుల విమర్శలు తార స్థాయికి చేరాయి. అంతేకాకుండా తాను డిసెంబరు నుంచి కేంద్రంపై పోరాటం ప్రారంభిస్తామని కేసీఆర్ గతంలో వ్యాఖ్యానించారు. నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. అమిత్ షా పర్యటనపైనా విమర్శలు గుప్పించారు. వరదల వల్ల భారీగా నష్టపోయామని, రూ.1350 కోట్లు అడిగితే పైసా కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. ఈ బక్క కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు ఇంత మంది వస్తున్నారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పీడ్‌కి బీజేపీ బ్రేకులు వేసింది. తామే తెలంగాణలో ప్రత్యామ్నాయమని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రానున్న కాలంలో టీఆర్ఎస్‌కు ఓటమి తప్పదని బీజేపీ వ్యాఖ్యానిస్తోంది. పరిస్థితులు ఇలా ఉంటే..మరోవైపు రెండు రోజుల క్రితం పార్లమెంటు భవనానికి శంకుస్థాపన విషయంలో ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖ కూడా చర్చకు కారణమైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ మోడీని కలుస్తారా లేదా అనే చర్చ నడుస్తోంది.
ఇక వ్యవసాయ బిల్లు విషయంలో ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. చర్చలు సఫలం కాకపోవడంతో రైతులూ వెనక్కి తగ్గలేదు. మొన్న ప్రకటించిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. చాలాచోట్ల ఆ పార్టీ శ్రేణులే బంద్‌లో ముందున్నట్లు కనిపించింది. అయితే కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం కేసీఆర్ పార్టీ కార్యకలాపాల తరువాత రైతులకు మద్దతు ప్రకటిస్తారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఎవరెవర్ని కలుస్తారనే అంశం..రానున్న కాలంలో కేసీఆర్ అనుసరించనున్న రాజకీయ వ్యూహాలకు సంకేతంగా భావించవచ్చనే చర్చ కూడా మొదలైంది.
Also Read ;- జగనన్న బాణం.. తెలంగాణలో గురి తప్పితే..











