కథానుసారం, సహజత్వం కోసం నటీనటులు పలురకాల వేషధారణలతో కనిపిస్తుంటారు. ఒక్కోసారి ఎప్పుడూ చూడని లూక్స్ లో కూడా కొందరు నటీనటులను చూస్తుంటాం. యువసామ్రాట్ నాగచైతన్య కూడా ఇప్పడు బనియన్, లుంగీ ధరించి కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. తాజాగా “లవ్ స్టోరి” చిత్రంలో సందర్భానుసారంగా వచ్చే సన్నివేశాలలో ఆయన అలా కనిపించనున్నారు. సహజత్వానికి దగ్గరగా సినిమాలను తీసే శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో పాత్రలు కూడా నిజజీవితానికి దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ ప్రేమ కథాచిత్రంలోని ఫస్ట్ లుక్, ఓ పాటను ఇటీవల విడుదల చేశారు. ఆ లుక్ లో నాగచైతన్య మిడిల్ క్లాస్ కుర్రాడిగా సాధారణ ప్యాంట్, చొక్కాతో కనిపించగా, సోమవారం నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ చిత్రం నుంచి మరో లుక్ విడుదల చేసింది. ఇందులో బనియన్, లుంగీతో చైతూ ప్రేక్షకాభిమానులను ఆకట్టుకుంటున్నారు. తమ అభిమాన నటుడు ఆలా కనిపిస్తుండటంతో ఇందులో మాస్ అంశాలు చైతూ పాత్రలో పుష్కలంగా ఉంటాయని భావిస్తున్నారు.
ఇక చైతూ, సాయిపల్లవి తెలంగాణ యాసలో మాట్లాడతారని తెలుస్తోంది. లోగడ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన “ఫిదా“ చిత్రంలో సాయిపల్లవి తెలంగాణ యాసలో అద్భుతమైన నటనను కనబరిచింది. వాస్తవానికి తమిళ అమ్మాయి అయిన సాయిపల్లవికి అది తొలి చిత్రమైనప్పటికీ పాత్రోచితంగా చక్కటి అభినయాన్ని పలికించడంతో పాటు తెలంగాణ యాస డైలాగ్ డెలివరీలోను మంచి మార్కులు కొట్టేశారు. మరోసారి ఈ తాజా చిత్రం కోసం తెలంగాణ యాసలో ప్రేక్షకులను ఎంతో బాగా అలరించబోతున్నారట. అలాగే నాగచైతన్య కూడా యాసను దించేస్తూ పాత్రలో ఒదిగిపోయారని అంటున్నారు. ఇటీవలే పాటతో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయిన విషయం తెలిసిందే. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ చిత్రంపై యూనిట్ తో పాటు నాగచైతన్య ఎంతో నమ్మకంతో ఉన్నారు. దీని తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య తన కొత్త చిత్రం చేసేందుకు అంగీకరించారు.
Must Read ;- మాల్దీవుల తీరాన్ని తాకిన భారతీయ అందాలు