మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు వైసీపీకి పట్టం గట్టారు. పంచాయతీ ఎన్నికల్లో పోల్చితే పట్టణ ఓటర్లు ఎక్కువగా వైసీపీ వైపు మొగ్గుచూపారు. ఈ గెలుపునకు గల కారణాలపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కూడా త్వరలోనే ముగియనుంది. దీంతో రానున్న కాలంలో జరగాల్సిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలపై అందరి దృష్టి పడింది. ఈ జోరుతోనే తిరుపతి లోక్‌సభను మళ్లీ దక్కించుకుంటామని వైసీపీ చెబుతోంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కనీస ప్రభావం చూపలేని పరిస్థితిలోకి వెళ్లిన బీజేపీ కూడా తాము గెలిచి తీరతామని చెబుతోంది. టీడీపీ ఇప్పటికే తమ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో ఏమైనా మార్పులు ఉంటే తప్ప.. పనబాక లక్ష్మి పేరు మారకపోవచ్చు. వైసీపీ నుంచి, బీజేపీ నుంచి పలు పేర్లు వినిపిస్తున్నా..ఇంకా అభ్యర్థిత్వం ఖరారు కావాల్సి ఉంది.
గెలుపు తమదే అంటున్న వైసీపీ..
ఇంకా అభ్యర్థుల వివరాలు ఎలా ఉన్నా..వైసీపీ మాత్రం గెలుపు తమనేదని చెబుతోంది. ఇందుకు తిరుపతి పార్లమెంటు పరిధిలోని పురపాలక ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తోంది. వాటిని ఒకసారి పరిశీలిస్తే.. తిరుపతి లోక్ సభ పరిధిలో తిరుపతి నగర పాలక సంస్థలో పాటు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, గూడూరు పురపాలక సంఘాలున్నాయి. వీటిల్లో శ్రీకాళహస్తి, గూడూరుకు వార్డుల పునర్విభజన వివాదం, కోర్టు పరిధిలో ఉన్న కారణంతో ఎన్నికలు జరగలేదు. మిగిలిన అన్నింటిలోనూ వైసీపీ నెగ్గింది. టీడీపీ రెండో స్థానంలో నిలిచింది.
- తిరుపతిలో 22 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. 27 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఒక స్థానానికి కోర్టు కేసు కారణంగా ఎన్నిక జరగలేదు. మొత్తం 49 డివిజన్లు చూస్తే.. 48 వైసీపీ గెలిచింది. 1 టీడీపీ గెలిచింది. ఓట్ల ప్రకారం చూస్తే..ఏకగ్రీవాలు మినహాయిస్తే.. వైసీపికి 47వేలకుపైగా ఓట్లు రాగా టీడీపీకి 18712ఓట్లు వచ్చాయి. బీజేపీ2,546, జనసేన 231, సీపీఎం 1,338, సీపీఐ 619 ఓట్లు రాబట్టుకున్నాయి.
- సూళ్లూరుపేట మున్సిపాల్టీకి వస్తే 14 వార్డులు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. 11చోట్ల ఎన్నికలు జరగ్గా 24చోట్ల వైసీపీ గెలిచింది. ఒకచోట టీడీపీ గెలిచింది. ఓట్ల ప్రకారం చూస్తే11 వార్డుల్లో వైఎస్సార్‌సీపీకి 6,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ 2,380, బీజేపీ 874 ఓట్లు రాబట్టుకున్నాయి.
- నాయుడుపేటలో మొత్తం 25వార్డులున్నాయి. 22 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఒకటి గెలవగా టీడీపీ 1, బీజేపీ ఒక స్థానం గెలిచింది. వైఎస్సార్‌సీపీకి 1,735 ఓట్లు వచ్చాయి. టీడీపీ 178, కాంగ్రెస్ 345 ఓట్లు దక్కించుకున్నాయి.
- వెంకటగిరి మున్సిపాలిటీలో మొత్తం 25వార్డులు ఉండగా 3 వార్డులు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. గతంలో ఇక్కడ 2వార్డుల్లోనే వైసీపీ గెలవగా ఈ సారి మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. ఓట్ల విషయానికి వస్తే 16,883 ఓట్లు లభించాయి. టీడీపీకి 8,369, బీజేపీ 41, జనసేన 202, సీపీఐ 43 ఓట్లు రాబట్టుకున్నాయి.
- Must Read ;- ఆ రెండూ కూడ వదలం.. మైదుకూరు, తాడిపత్రిల్లో వైసీపీ ‘పవర్ ’పాలిటిక్స్
వైసీపీ గెలుస్తామనేందుకు..
- ఈ అంకెలనే వైసీపీ తెరపైకి తెచ్చి తిరుపతిలో తాము గెలుస్తామని చెబుతోంది. ఇందుకు అనుకూలంగానూ కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి. అయితే సాధారణంగానే రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే..ఆ పార్టీకి అనుకూలమైన ఫలితాలే రావడం సహజనంగానే జరుగుందని చెప్పవారూ ఉన్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో, చంద్రబాబు హయాంలో మాత్రం అధికార పార్టీలకు వ్యతిరేకంగా కొన్నిచోట్ల ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. వైఎస్ సీఎం అయిన కొత్తలోనూ ఉమ్మడి ఏపీలో ఇవే ఫలితాలు వచ్చాయని, తరువాతి కాలంలో ఆ పరిస్థితి మారిందని మరో విశ్లేషణ చేసేవారూ ఉన్నారు.
సగం ఓట్లు టీడీపీకి..
- అయితే స్థానాల ప్రకారం చూస్తే వైసీపీ క్లీన్ స్వీప్‌గా కనిపిస్తున్నా.. తిరుపతి లోక్‌సభ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన చోట్ల రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీతో పోల్చితే టీడీపీకి సగం ఓట్లు వచ్చాయి. ఇదికూడా గమనించాల్సిన అంశమే. స్థానిక సంస్థల ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని, అసలైన ప్రజాభిప్రాయం అసెంబ్లీ, పార్లమెంటు జనరల్ ఎన్నికలేననే అభిప్రాయం కూడా మరోవైపు వ్యక్తం అవుతోంది. ఇక వైసీపీ చెబుతున్న క్లీన్ స్వీప్ విషయానికి వస్తే.. ఏకగ్రీవాలకు కూడా కారణాలు చాలానే ఉంటాయి. అంతా సవ్యంగా జరిగితే మరో మూడేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో నిధులు కావాలంటే అధికారపార్టీనే గెలవాలనే అభిప్రాయం ప్రకారం కూడా ఓటింగ్ సరళి ఉంటుంది. ఇది సాధారణమే. తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ గెలుపు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఒక్క ఎంపీ గెలిచినంత మాత్రాన కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారేది ఉండదని, తమ అభ్యర్థి గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని, పంచాయతీల్లో, మున్సిపాల్టీల్లో తమ పార్టీనే అధికారంలో ఉందని చెప్పే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఎన్నికలకు ముందు కొన్ని పనులు చేపట్టే అవకాశం కూడా దక్కుతుంది.
Also Read ;- ఎంపీ Vs ఎమ్మెల్యే.. జంగారెడ్డిగూడెం పీఠానికి వైసీపీలో గ్రూపులు