తమిళ హీరో ఇళయ దళపతి విజయ్ సంక్రాంతికి వచ్చేస్తున్నాడండోయ్. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందిన ‘మాస్టర్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయిపోయినట్లు సమాచారం. ఇందులో మరో కీలకపాత్రను తమిళ అగ్రహీరో విజయ్ సేతుపతి పోషించారు. సెన్సార్ కు పంపే ముందు ‘మాస్టర్’ టీమ్ ఈ సినిమా చూసినట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ సరసన మాళవికా మోహనన్ నటించింది. ఆండ్రియా జెరెమియా, శాంతను భాగ్యరాజ్, అర్జున్ దాస్ తదితరులు ఇతర పాత్రలను పోషించారు.
ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి నెట్ ఫ్లిక్స్ తో రూ. 100 కోట్లకు ఒప్పందం జరిగినట్లు ప్రచారం సాగింది. అయితే అలాంటి అవకాశం వచ్చినా తాము థియేటర్లో ఈ సినిమాని విడుదల చేయడానికే మొగ్గుచూపామని ఎక్స్ బీ క్రియేటర్స్ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాలో హీరో విజయ్ జేడీ అనే ఫ్రొఫెసర్ పాత్రను పోషించినట్టు తెలిసింది. గత నవంబరు 14న దీని టీజర్ ను విడుదల చేశారు. విడుదలైన రెండు వారాల్లో 40 మిలియన్ల వ్యూస్ ఈ టీజర్ సాధించింది. 16 గంటల వ్యవధిలో 1.6 మిలియన్లకు పైగా లైక్‌లతో దూసుకుపోయింది. హీరోగా విజయ్ కు ఇది 64వ సినిమా. జనవరి 13న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీని ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు.
సన్ పిక్చర్స్ తో 65వ సినిమా
మాస్టర్ విడుదల కాగానే సన్ పిక్చర్స్ తో విజయ్ 65వ సినిమా చేస్తున్నారు. దీన్ని అధికారికంగా కూడా ధ్రువీకరించారు. నీల్సన్ దిలీప్ కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తారు. అనిరుధ్ దీనికి సంగీతం వహిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమి సెట్స్ మీదికి వెళ్లనుంది. తెలుగులో కూడా ఈ సినిమాని ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు సెర్చ్ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘వకీల్ సాబ్’, విజయ్ ‘మాస్టర్’, అజిత్ ‘వాలిమై’, కేజీఎఫ్ 2, అర్జున్ ‘పుష్ప’ చిత్రాలే ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ విడుదలపై స్ఫష్టత లేనందున దీన్ని వేసవిలో విడుదలయ్యే సినిమాగా భావిస్తున్నారు. రజనీకాంత్ అన్నాత్తే కూడా ఈ సంక్రాంతికి రావలసి ఉన్నా ఇంకా షూటింగు కార్యక్రమాలు పూర్తికాని కారణంగా ఫిబ్రవరి, మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉంది.
Must Read ;- పవన్ కళ్యాణ్ తో ఎం.ఎస్.రాజు సినిమా నిజమేనా.?