‘మహిళలు అంటే ఆకాశంలో సగభాగం. ఆర్థిక, సామాజిక, రాజకీయంగా మహిళలకు హక్కులు కల్పించాలి. మహిళా సంక్షేమానికి, ఆర్థిక స్వావలంభనకు ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టింది.. కుటుంబానికి చుక్కానిలా మహిళలు అందిస్తున్న సేవలకు కొలమానాలు లేవు. గతంలో చంద్రబాబు మహిళలను ఉద్దేశించి దారుణంగా మాట్లాడారు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని హేళన చేశారన్నారు. మన తల్లులు మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు కాబట్టే.. ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నాం’
-మహిళా దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని తన కార్యాలయంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు.
‘మా భూములు పోయాయి.. మేము విజయవాడ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తుంటే అడ్డుకుంటారా.. మా భూములు పోయి నష్టపోయాం. జగన్ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. మాకు మరో మార్గం లేదు. మేం శాంతి యుతంగా నిరసన తెలిపేందుకు కూడా అడ్డంకులు కల్పిస్తున్నారు. మమ్మల్ని అడ్డుకుంటే ప్రకాశం బ్యారేజీలో దూకుతాం.’
-ఇదీ అమరావతి మహిళా రైతుల ర్యాలీని అడ్డుకున్న సందర్భంగా మహిళలు చేసిన వ్యాఖ్యలు.
‘విజయవాడ అమ్మవారి దర్శనానికి ర్యాలీగా వెళ్తుంటే అడ్డంకులు..ప్రకాశం బ్యారేజీ వద్ద మహిళలపై పోలీసుల నిర్బంధం. రహదారులపై మహిళల బైఠాయింపు. ధర్నాలు చేస్తున్న మహిళలకు అల్పాహారం ఇవ్వడానికి కూడా పోలీసుల అభ్యంతరాలు.. పురుగు మందు డబ్బాలతో ఆత్మహత్యకు సిద్ధమని మహిళల నినాదాలు. ఆందోళనలు చేస్తున్న మహిళల అరెస్టు. సొమ్మసిల్లి పడిపోయిన పలువురు మహిళలు.
Must Read ;- దుర్గగుడికి వెళుతున్న మహిళా రైతుల అడ్డగింత.. ప్రకాశం బ్యారేజీపై తీవ్ర ఉద్రిక్తత
ఇదీ రాజధాని ప్రాంతంలో మహిళా దినోత్సవం రోజున చోటుచేసుకున్న పరిణామాలు
ఓవైపు మహిళా దినోత్సవం రోజున మహిళల గురించి బ్యానర్ స్థాయిలో ప్రకటనలు, స్పీచ్‌లతో ఊదరగొడుతున్న ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా తమకు కనీస గౌరవం ఇవ్వకుండా అరెస్టు చేయించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమరావతి ఉద్యమాన్ని ఎలాగైనా అణచివేయాలని ప్రభుత్వం చూస్తున్నా.. అమరావతి రైతులు మాత్రం తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. మహిళా దినోత్సవం రోజున ప్రకాశం బ్యారేజీపై ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు ఆ మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. మహిళా రైతులను మంగళగిరి, తాడేపల్లి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేయడంతోపాటు సేవ్ అమరావతి నినాదాలతో రహదారులపై ఆందోళనలకు సిద్ధమయ్యాయి. మందడంతో పాటు వెలగపూడి తదితర ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంతేకాకుండా..ధర్నా చేస్తున్న మహిళలకు అల్పాహారం ఇస్తుండగా పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు పురుగుల మందు డబ్బాలను చేతపట్టుకుని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.మహిళా దినోత్సవం రోజు మహిళలకు ఈ ప్రభుత్వం అరెస్టులను బహుమతిగా ఇచ్చిందని ఆందోళనకారులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ప్రతిపక్షాల విమర్శలు..
కాగా మహిళల అరెస్టులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ప్రభుత్వ సొంత పత్రికా ప్రకటనలో మహిళలకు ఉన్న స్వేచ్ఛ రాష్ట్రంలో కనిపించడం లేదని, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మహిళలకు లేదా, కనీసం గుడికి వెళ్లే హక్కు కూడా లేదా అని లోకేష్ ప్రశ్నించారు.అమరావతిలో మహిళల్ని అడ్డుకొని పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని, రైతుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. మరోవైపు ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాధ్ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూనే పాదయాత్ర చేస్తున్న అమరావతి మహిళలకు మద్దతు తెలిపారు. శాంతియుతంగా దుర్గగుడికి పాదయాత్ర చేస్తున్న అమరావతి మహిళలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.
ALso Read ;- అమరావతి కోసం విజయవాడలోని ఇంటికొకరు రావాలి చంద్రబాబు
మీ పత్రికా ప్రకటన లో మహిళలకు ఉన్న స్వేచ్ఛ రాష్ట్రంలో కనపడటం లేదు @ysjagan గారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మహిళలకు లేదా?కనీసం గుడికి వెళ్లే హక్కు కూడా లేదా?అమరావతిలో మహిళల్ని అడ్డుకొని పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని, రైతుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/2) pic.twitter.com/GF2NJkcdgq
— Lokesh Nara (@naralokesh) March 8, 2021