కార్తికేయ కథానాయకుడిగా రూపొందిన ‘చావుకబురు చల్లగా’ .. విడుదలకు ముస్తాబవుతోంది. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమా ద్వారా కౌశిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో శవాలను తన వాహనంలో శ్మశానానికి తరలించే ‘బస్తీ బాలరాజు‘ పాత్రలో కార్తికేయ నటించాడు. పూర్తి మాస్ లుక్ తో ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా లావణ్య త్రిపాఠి అలరించనుంది. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ బాణీలను అందించాడు.
ఈ సినిమాలో కార్తికేయ – అనసూయ మధ్య ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ‘పైన పటారం .. ‘ అంటూ ఈ పాట సాగుతుంది. కొంతసేపటి క్రితమే ఈ పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఎరుపుచీర కట్టుకుని .. ఆకుపచ్చ గాజులు వేసుకుని .. వెర్రెతించే అందాలతో అనసూయ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ సినిమాకి ఈ పాట ప్రత్యేక ఆకర్షణ అవుతుందనే అనాలి. మాస్ కుర్రాళ్లు ఇప్పట్లో ఈ పాటను మరిచిపోలేరనే చెప్పాలి. ఇక కార్తికేయ కూడా మాస్ స్టెప్పులతో తెగ రెచ్చిపోయాడు.
కార్తికేయకి కొంతకాలంగా సరైన హిట్ లేదు .. అందువలన తాను ఎదురుచూస్తున్న హిట్ ఈ సినిమాతో వస్తుందని ఆయన ఆశిస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి మార్కెట్ కూడా అంత గొప్పగా ఏం లేదు. అందువలన ఈ సినిమా తనకి మరిన్ని అవకాశాలను తెస్తుందనే ఉత్సాహంతోనే ఆమె ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను మార్చి 19వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఈ ‘చావుకబురు చల్లగా‘ .. హిట్ కబురు తీయగా చెబుతుందేమో చూడాలి.
Must Read ;- స్పెషల్ సాంగ్స్ పై క్లారిటీ ఇచ్చిన అనసూయ











