నిజమే… రికార్డులు సృష్టించాలనుకున్నప్పుడు… అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. లేదంటే అంతే సంగతులు. సాధారణ విషయాల్లోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ రికార్డుల వేట సాగుతున్నప్పుడు… ప్రజల ప్రాణాల రక్షణతో ముడిపడి ఉన్న అంశాలపై ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి? ఈ విషయంలో ఏపీలోని జగన్ సర్కారు వ్యవహరించిన తీరు పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కుంటోంది. రికార్డుల వేటకు దిగిన జగన్ సర్కారు జాగ్రత్తలు పాటించకుండా హడావిడిగా వ్యవహరించిన ఫలితంగా ఏకంగా 31 మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఏపీలో నిన్న జరిగిన కరోనా వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్ పేరిట చేపట్టిన కార్యక్రమంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకున్న దాఖలా కనిపించలేదు. అదేదో… నిర్దేశిత సంఖ్యలో జనాలకు వ్యాక్సిన్ వేశామా? లేదా? అన్న విషయం మీదే అధికారులు దృష్టి పెట్టడం కారణంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. మరి ఈ ఘటన ఏమిటో? ఎక్కడ జరిగిందో? ఎలా జరిగిందో? ఓ సారి చూద్దామా?
డోసులు రాగానే హడావిడి
జగన్ సర్కారు వ్యాక్సినేషన్ కు సంబంధించి దేశంలోనే రికార్డు సృష్టిద్దామని తలచిన జగన్ సర్కారు… ఆదివారం నాడు రాష్ట్రంలో మెగా డ్రైవ్ పేరిట భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలో దాదాపుగా 10 లక్షల మందికి ఒకే రోజు వ్యాక్సిన్ వేద్దామని ప్రణాళికలు రచించింది. కేంద్రం నుంచి సరిపడ డోసులు అందేసరికి… ముందస్తు ప్రణాళిక లేకుండానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. అందుబాటులో డోసులున్నాయి. ఇంకేం మెగా డ్రైవ్ చేపట్టేద్దాం పదండి అంటూ ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు రాగానే… రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సన్నాహకాలు లేకుండానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా పీడ దినాల్లో వ్యాక్సిన్ దొరకడమే గగనమైపోతున్న సమయంలో మెగా డ్రైవ్ లో వ్యాక్సిన్ దొరుకుతుంది కదా అన్న భావనతో జనం కూడా మెగా డ్రైవ్ కు బారులు తీరారు.
తొలి డోసు కోవిషీల్డ్… రెండో డోసుగా కోవాగ్జిన్
మెగా డ్రైవ్ లో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీలయినన్ని చోట్ల వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా గుడియానంపల్లిలోనూ మెగా డ్రైవ్ కింద వ్యాక్సినేషన్ చేపట్టారు. అయితే అది తొలి డోసా? రెండో డోసా? అన్న విషయాన్ని వైద్య సిబ్బంది అంతగా పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. గ్రామంలో చాలా మంది కోవిషీల్డ్ ను తొలి డోసుగా తీసుకున్నారు. అయితే అక్కడికి మెగా డ్రైవ్ కింద కోవాగ్జిన్ డోసులు వెళ్లినట్లు సమాచారం. మెగా డ్రైవ్ కదా… ఏదైనా వేసేద్దామన్న రీతిలోనే వ్యవహరించిన వైద్య సిబ్బంది… గ్రామంలో తొలి డోసుగా కోవిషీల్డ్ తీసుకున్న 31 మందికి రెండో డోసు కింద కోవాగ్జిన్ వేసేశారు. రెండూ వేర్వేరు డోసులు తీసుకున్న వారి పరిస్థితి ఏమిటో? ఇప్పటికే చూశాం కదా. ఇదే విషయం తెలుసుకున్న బాధితులు ఆందోళనలో కూరుకుపోయారు. అంతేకాకుండా తమకు ఏ తొలి డోసు కింద ఏ కంపెనీ వ్యాక్సిన్ వేశారు? రెండో డోసు కింద ఏ వ్యాక్సిన్ వేస్తున్నామన్న విషయాన్ని సిబ్బంది అసలు పట్టించుకోలేదని… రెండు వేర్వేరు కంపెనీల డోసులు తీసుకున్న తమ పరిస్థితి ఇప్పుడేమిటంటూ వారు వాపోతున్నారు. అంతేకాకుండా ఒక్క డోసు తీసుకున్న కొందరికి అది వికటిస్తున్న సందర్భాను గుర్తు చేసుకుంటూ.. రెండూ వేర్వేరు డోసులు తీసుకున్న తమ పరిస్థితి ఏం కావాలంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళదీస్తున్నారు.
తప్పు తెలుసుకున్నాకా నిర్లక్ష్యమే!
ఈ విషయంపై ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా జిల్లా వైద్య , ఆరోగ్య శాఖాధికారి శ్రీహరి చాలా ఈజీగా స్పందించారు. తొలి డోసుగా కోవిషీల్డ్ ఇచ్చిన వారిలో 31 మందికి రెండో డోసుగా కోవాగ్జిన్ ఇచ్చిన మాట వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పిన ఆయన… ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. విచారణలో ఎవరి తప్పుందని తేలితే… వారిపై చర్యలు తీససుకుంటామని చెప్పారు. అయితే రెండూ వేర్వేరు డోసులు తీసుకున్న వారి పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నను చాలా లైటర్ వేలో తీసుకున్న ఆయన… ప్రస్తుతం బాధితులంతా గ్రామంలోనే ఉన్నారని, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే ముందు జాగ్రత్త చర్యలుగా బాధితులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిస్తారా? అన్న ప్రశ్నకు శ్రీహరి విచిత్రంగా స్పందించారు. బాధితుల్లో ఏదైనా సమస్యలు తలెత్తితేనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తామని, అప్పటిదాకా వారిని గ్రామంలోనే ఉంచుతామని పేర్కొనడం గమనార్హం.
Must Read ;- కడప గడపలో జగన్ తమ్ముడికి భంగపాటు