ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాల రచనలో కేసీఆర్ దిట్టగానే చెప్పాలి. ప్రత్యేకించి ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాలకు ప్రత్యర్థి పార్టీలు చిత్తు చిత్తు అవుతున్న పరిస్థితి చాలా కాలంగా మనం చూస్తున్నదే. అయితే ఎందుకనో గానీ.. త్వరలోనే జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ తెగ భయపెడుతున్నట్లుగా విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఏ ఎన్నిక అయినా చాలా సంస్థలు తమదైన శైలిలో సర్వేలను వెల్లడిస్తూ పార్టీల్లో టెన్షన్ ను పెంచుతుంటాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనూ అలాంటి సర్వేలే కొన్ని వెలువడగా.. వాటిని చూసిన కేసీఆర్ భయపడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా ఆయా సర్వేలను చూపిస్తూ కేసీఆర్.. హుజూరాబాద్ లో గెలుపు మాదేనంటూ ఆసక్తికర ప్రకటనలు గుప్పించారు. ఈ ప్రకటనలు చూసిన వారంతా హుజూరాబాద్ ఫలితాలపై కేసీఆర్ లో భయం మొదలైపోయిందన్న కోణంలో విశ్లేషణలు చేస్తున్నారు.
కేసీఆర్ ఏమన్నారంటే..?
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా తనకు టికెట్ కేటాయించినందుకు సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, హుజూరాబాద్‌లో గెలిచి పార్టీ ప్రతిష్ఠను పెంచుతానని ఈ సందర్భంగా గెల్లు వ్యాఖ్యానించారు. అనంతరం మాట్లాడిన కేసీఆర్.. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని, ఈ ఉప ఎన్నిక అభివృద్ధి, సంక్షేమ పథకాల వ్యతిరేకులకు చెంపపెట్టు అవుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో యువ సత్తా చాటి గులాబీ జెండాను ఎగురవేయాలని శ్రీనివాస్ యాదవ్‌కు సూచించారు. టీఆర్ఎస్‌పై ప్రజాభిమానాన్ని తెలియజెప్పేందుకు వచ్చిన చక్కని అవకాశమే హుజూరాబాద్ ఉప ఎన్నిక అని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విశ్లేషకుల లెక్క ఇది
సాధారణంగా ఏ ఎన్నిక అయినా సర్వేలను చూపుతూ విపక్షాలు ముందుగా స్పందిస్తూ ఉంటాయి. అధికార పక్షంలో భయాన్ని రేకెత్తించేందుకు విపక్షాలు ఎంచుకునే వ్యూహం ఇది. సర్వేల పేరు చెప్పి అధికార పక్షాన్ని డిఫెన్స్ లోకి నెట్టేస్తే.. తాము బలంగా ముందుకు సాగే వీలుంటుందన్న కోణంలోనే విపక్షాలు ఈ యత్నాలు చేస్తాయి. అయితే అందుకు విరుద్ధంగా అధికార పక్షంలో ఉన్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నుంచి అందరి కంటే ముందు సర్వేల మాట వినిపించిందంటే.. విపక్షాలు బలంగా ఉన్న మాటను ఆయన పసిగట్టేసినట్టే. ఓ వైపు ఈటల రూపంలో బలంగా దూసుకొస్తున్న బీజేపీ, మరో వైపు రేవంత్ నేతృత్వంలో అంతకంతకూ బలం పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీలను.. ఆయా పార్టీలకు జనాల్లో పెరుగుతున్న మద్దతును పసిగట్టిన కేసీఆర్.. సర్వేల పేరు చెప్పి టీఆర్ఎస్ ను బలంగా చూపే యత్నం చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- కొండా సురేఖ బరిలోకి దిగుతున్నారా?