బాలీవుడ్ తెరపై కథానాయికగా అనుష్క శర్మకి మంచి క్రేజ్ ఉంది. గ్లామర్ పరంగానే కాదు .. నటన పరంగాను ఆమె తన సత్తా చాటుకుంది. కెరియర్ ఫుల్ జోష్ తో సాగుతున్న సమయంలోనే ఆమె విరాట్ కోహ్లీ ప్రేమలో పడింది. వాళ్ల ప్రేమ విశ్వమంతా విహరించిన తరువాతనే పెళ్లి పీటలు ఎక్కింది. అటు క్రికెట్ పరంగా కోహ్లీకి కోట్లాదిమంది అభిమానులు .. ఇటు వెండితెరపై అనుష్కకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అందువలన సహజంగానే ఈ జంట అందరి మనసులను గెలిచింది .. ఓ ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం అనుష్క శర్మ గర్భవతిగా ఉంది. వచ్చే నెలలో ఆమె ఫస్టు బేబీకి జన్మనివ్వనుంది. ఆ ఆనంద క్షణాల కోసం .. అపురూప క్షణాల కోసం ఈ జంట ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే అనుష్క శర్మ తను చేసిన ఒక యాడ్ ను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘ప్రెగ్నెన్సీ సెల్ఫ్ టెస్ట్ కిట్’ కి సంబంధించిన ‘ప్రెగా న్యూస్’ యాడ్ లో ఆమె ఎంతో సహజంగా నటించింది. కడుపులో బిడ్డ కదులుతున్నప్పుడు ఒక స్త్రీ .. తల్లిగా ఎలాంటి ఆనందానుభూతిని పొందుతుందో, అలాంటి అనుభూతిని తాను మొదటిసారిగా పొందుతున్నానని అనుష్క శర్మ చెప్పడం విశేషం.
అనుష్క – కోహ్లీ దంపతులు త్వరలో చెప్పనున్న శుభవార్త కోసం వాళ్ల అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బిడ్డకి తల్లి అయ్యాక అనుష్క నటిగా గతంలో మాదిరిగానే తన జోరు చూపుతుందా? లేదంటే ఐశ్వర్యారాయ్ మాదిరిగా ఆ బిడ్డ ఆలనాపాలనకే సమయాన్ని కేటాయిస్తుందా? అనేది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అనుష్క శర్మ మాత్రం మే నెల నుంచి షూటింగులో పాల్గొంటానని చెబుతోంది. అది ఎంతవరకూ సాధ్యమవుతుందో చూడాలి మరి.
Must Read ;- ‘ఈ సమయంలో నా భార్యతో ఉండడం ముఖ్యం’