ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వ్యవహారం చివరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ లాగా ప్రజలకు కనిపిస్తోంది. ఎలాగైనా స్థానిక ఎన్నికలు నిర్వహించి తీరాలని నిమ్మగడ్డ, ఆయన పదవీ విరమణ చేసే వరకూ ఎన్నికలు జరపకూడదని వైసీపీ ప్రభుత్వం, ఇలా ఎవరికి వారు తమ పంతం నెగ్గాలని ప్రయత్నిస్తున్నట్టు ప్రజలందరికీ అర్థం అవుతూనే ఉంది. సహజంగా వైసీపీ అభిమానులు ప్రభుత్వ తీరును సమర్థిస్తూఉంటే, టీడీపీ శ్రేణులు నిమ్మగడ్డ తీరును మెచ్చుకుంటున్నాయి. మధ్యలో జనానికి వీరి తీరుపై చిర్రెత్తికొస్తోంది.
స్థానిక ఎన్నికలు సమయానికి జరిగిన చరిత్ర ఉందా?
దేశంలో సార్వత్రిక ఎన్నికలు మాత్రమే గడువు మీరకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహిస్తూ ఉంటారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఐదు సంవత్సరాలకు తప్పనిసరిగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం చెబుతున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వారు ఎప్పుడు నిర్వహించాలనుకుంటే అప్పుడే స్థానిక ఎన్నికలు జరుగుతాయి. ఒక్కోసారి పదవీకాలం ముగిసిన మూడేళ్లకు కూడా స్థానిక ఎన్నికలు పెట్టరు. అది ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవారి ఇష్టానుసారంగా కొనసాగుతోంది. అయితే ఏపీలో స్థానిక ఎన్నికలు పదవీకాలం ముగిసి రెండు సంవత్సరాలు అవుతోంది. అయితే ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు పూర్తి చేయాలని వైసీపీ ప్రభుత్వం భావించింది. కరోనా వైరస్ భయాందోళనలతో ఎన్నికలు వాయిదా వేశారు. ఇక అప్పటి నుంచి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు, ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.
Must Read ;- నిమ్మగడ్డతో పెట్టుకుంటే అంతే.. సర్కారుకు సరికొత్త బ్రేక్
మరో ఆరు నెలలు ఆగితే ఏమౌతుంది.
స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని కథకథలుగా రాసుకోవడమే కాని, ఇక్కడ విఫలమైంది ప్రభుత్వాలు కాదు. అధికారంలోకి వచ్చిన వారు సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పాగా వేయాలని చూస్తారు. కానీ వారు గెలుస్తారన్న నమ్మకం ఉంటేనే ఎన్నికలకు వెళతారు. ఇక వారికి ఎన్నికలు పెట్టే ఉద్దేశం లేకపోతే ఏదో ఒక సాకు చూపుతూ కోర్టులను ఆశ్రయించి కాలయాపన చేస్తూ కాలం గడుపుతారు. ఏపీలో రెండు సంవత్సరాల కిందట జరగాల్సిన స్థానిక ఎన్నికలు ఈ ఏడాది మార్చిలో పూర్తిచేయాలని ప్రభుత్వం భావించింది. అంతా అధికారపార్టీ వారు అనుకున్న విధంగా జరుగుతున్న సమయంలో కరోనా వచ్చిపడింది.
దీంతో రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే నిమ్మగడ్డ కావాలనే వాయిదా వేశారని ప్రభుత్వం కక్షకట్టినట్టుగా కనిపిస్తోంది. నిమ్మగడ్డ విషయానికొస్తే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించినా హైకోర్టును ఆశ్రయించి మరీ పదవిని సాధించుకున్నారు. అంతవరకూ ఓకే.. ఆ తర్వాత.. ప్రభుత్వాన్ని ప్రత్యర్థిలాగా భావిస్తూ.. వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.
కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా ఎన్నికలు సాధ్యమా? కాదనే సమాధానం వస్తుంది. ఎన్నికలకు వేలాది మంది సిబ్బంది అవసరం అవుతుంది. భద్రతా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థ మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు సిద్దమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు వారు సంసిద్ధత వ్యక్తం చేస్తేనే ఎన్నికలు నిర్వహించడం సాధ్యం అవుతుంది. అంతేకాని వారు ఎన్నికలు నిర్వహించడానికి మేం సిద్దంగా లేము అని చెబుతున్నా, ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించి తీరుతానని నిమ్మగడ్డ చేస్తున్న ప్రయత్నాలన్నీ కోర్టుకు సాక్ష్యాలుగా చూపడానికి చేసే ప్రయత్నాలుగా మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక వేళ కోర్టు కూడా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించి తీరాలని తీర్పునిస్తే, ఆ తీర్పును ప్రభుత్వం గౌరవించకపోతే, కోర్టులు వచ్చి ఎన్నికలు నిర్వహిస్తాయా? దేశంలో కొన్ని వ్యవస్థలకు ఆదేశాలు జారీ చేయడం వరకే వారికి అధికారం ఉంటుంది. మరలా దాన్ని అమలు చేయాల్సింది అధికారంలో ఉన్న ప్రభుత్వాలే.
వ్యక్తిగత పోరాటంలా మారింది?
ఎన్నికల సంఘం- రాష్ట్రప్రభుత్వం అనే రెండు వ్యవస్థల మధ్య మహా అయితే ప్రతిష్టంభన ఏర్పడగలదు. కానీ.. ఇప్పుడు ఆ రెండు వ్యవస్థలకు నేతృత్వం వహిస్తున్న వారి మధ్య వ్యక్తిగత బలప్రదర్శన పోరాటంలాగా మారింది. ఆయన పోతే తప్ప.. ఎన్నికలకు వెళ్లకూడదని ప్రభుత్వమూ.. అదే మాదిరిగా, తాను వెళ్లేలోగా ఎన్నికలు పూర్తి చేసే వెళ్లాలని నిమ్మగడ్డ.. ఇలా మంకుపట్టుతో ముందుకు సాగుతున్నారు. కోర్టు చెప్పినట్టుగా మీరు సహకరించాలని ఆయన చాలా టెక్నికల్ గా రాస్తున్నారు. ప్రభుత్వం కూడా టెక్నికల్ గా సహకరించం అని చెప్పకుండా.. ప్రజల ప్రాణాలకు ప్రమాదం గనుక.. పరిస్థితి శాంతించాక మా సన్నద్ధత గురించి మేమే చెబుతాం అంటోంది. ఇది తెగే వ్యవహారం కాదు. మళ్లీ మళ్లీ కోర్టులకు వెళ్లడానికి మాత్రమే ఉపకరిస్తుంది.
Also Read ;- నిమ్మగడ్డ వర్సెస్ నీలం సాహ్ని