ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. సోమవారం మొదలై ఐదు రోజుల పాటు సాగిన సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. సరే.. అసెంబ్లీ సమావేశాలు సాధారణంగానే జరుగుతుంటాయిగా… ఈ శీతాకాల సమావేశాలకు అంతగా ప్రత్యేకత ఏముంది? అంటారా? తెలుగు నేల చరిత్రలో ఈ సమావేశాలు మాత్రం చరిత్రలో నిలిచిపోయేవేనని చెప్పక తప్పదు. ఎందుకో తెలుసా?.. ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగితే… ఐదు రోజులూ విపక్ష సభ్యులను అధికార పక్షం సస్పెండ్ చేసి పారేసింది. మరి సభ జరిగినన్ని రోజులూ విపక్ష సభ్యులు సస్పెన్షన్‌కు గురైన సందర్భాలు మన తెలుగు నేల రాజకీయాల్లో దాదాపుగా లేవు కదా. అందుకే ఇవి చరిత్రలో నిలి చిపోయే సమావేశాలుగానే చెప్పుకోవాలి.
అవకాశం ఇస్తామని నమ్మబలికి..
కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో శీతాకాల సమావేశాలను ఐదు రోజులు మాత్రమే జరుపుకుందామని చెప్పిన అధికార వైసీపీ… ఈ ఐదు రోజుల సమావేశాల్లో కీలక అంశాలపై చర్చిద్దామని, విపక్షం కూడా తమకు సహకరించాలని, విపక్షానికి కూడా సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అవకాశం ఇస్తామని నమ్మబలికింది. అయితే తీరా సమావేశాలు ప్రారంభం కాగానే… ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సహా సభలోని విపక్ష సభ్యులందరిపైనా సస్పెన్షన్ వేటు వేసిన అధికార పక్షం… ఆ తర్వాత వరుసగా నాలుగు రోజుల పాటు చంద్రబాబును మినహాయించిన మిగిలిన సభ్యులను సస్పెండ్ చేస్తూ సాగింది.
Also Read ;- స్పీకరు పోడియం ఎదుట చంద్రబాబు బైఠాయింపు
ఐదు రోజులూ ఇబ్బంది పడ్డారా..
ఇక ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగిన గడచిన ఐదు రోజుల పాటు స్పీకర్ కుర్చీలో ఉన్న తమ్మినేని సీతారాంకు నిద్రే పట్టలేదట. ఎందుకంటే… విపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలని తానేమీ కోరుకోనని, అయితే విపక్ష సభ్యులు ఎంత చెప్పినా వినలేదని, ఈ నేపథ్యంలోనే వారిని సస్పెండ్ చేయాల్సి వచ్చిందని తమ్మినేని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన తర్వాత తమ్మినేని ఈ వ్యాఖ్యలు చేశారు. సభ్యులను సస్సెండ్ చేస్తే… ఆ రోజు తనకు నిద్ర పట్టదని కూడా ఆయన అన్నారు. ఈ లెక్కన ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగిన ఐదు రోజులూ విపక్ష సభ్యులను సస్సెండ్ చేసిన తమ్మినేని… ఆ ఐదు రోజులూ నిద్ర రాక ఇబ్బంది పడి ఉంటారన్న మాట.
Must Read ;- అసెంబ్లీలో చెలరేగుతుండగా.. జగన్‌పై సుప్రీం ఏమంటుందో?