Tremors In The YCP Began :
అటు అధికారంలో ఉన్నా.. ఇటు విపక్షంలో ఉన్నా తెలుగు దేశం పార్టీ(టీడీపీ)ది ప్రజాపక్షమే. నిత్యం ప్రజలతోనే కలిసి సాగుతున్నందుననే.. క్షేత్ర స్థాయిలో ఏ పార్టీకి లేనంత కార్యకర్తల బలం టీడీపీ సొంతమని కూడా చెప్పాలి. పార్టీ అధినాయకత్వం నిత్యం సమీక్షలు, సమావేశాలతో అధికార పార్టీపై పోరుకు వ్యూహాలు రచిస్తుంటే.. పార్టీ కీలక నేతలు, కార్యకర్తలు వాటిని అమలు చేస్తూ జగన్ సర్కారుకు చుక్కలు చూపిస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దూకుడు పెంచిన నేపథ్యంలో ఇటీవలి కాలంలో వైసీపీ సర్కారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై టీడీపీ శ్రేణులు ఎప్పటికప్పుడు తమదైన శైలి నిరసనలతో విరుచుకుపడుతున్నాయి. పలితంగా వైసీపీ సర్కారుకు నిజంగానే బొమ్మ కనిపిస్తోందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
600 రోజులు దాటిన రాజధాని నిరసనలు
అమరావతి రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాల భూములను ఇచ్చిన అమరావతి రైతులకు టీడీపీ ఆది నుంచి సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్వయంగా అమరావతి దీక్షా శిబిరాలను సందర్శించి తనవంతుగా తన చేతికి ఉన్న బంగారు గాజులను అందించారు. ఆ తర్వాత నారా లోకేశ్ కూడా ఈ నిరసనలకు ఎప్పటికప్పుడు కొత్త ఉత్తేజం నిండేలా ట్వీట్లు చేస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో అమరావతి దీక్షా శిబిరాలకు వెళుతున్నారు. అమరావతి రైతులపై కొనసాగుతున్న పోలీసు ఆంక్షలపైనా ఆయన ఎప్పటికప్పుడు తనదైన శైలిలో నిరసనలు తెలుపుతున్నారు. జగన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారంటూ వైసీపీ సర్కారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని విస్పష్టంగా చెబుతున్నారు. టీడీపీ సంపూర్ణ మద్దతు, పార్టీ అధినాయకత్వం, పార్టీకి చెందిన కీలక నేతల మద్దతుతోనే అమరావతి రైతుల దీక్షలు ఇటీవలే 600 రోజుల మార్కును దాటాయి. ఇక అమరావతి రైతులపై నమోదవుతున్న కేసులపైనా టీడీపీ నేతలు తమదైన శైలిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వెరసి వైసీపీ సర్కారుకు బీపీ పెంచేస్తున్నారు.
దేనిని వదలట్లేదబ్బా
జగన్ సర్కారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కూలంకషంగా పరిశీలిస్తూ సాగుతున్న టీడీపీ.. ఆయా నిర్ణయాల్లోని తప్పొప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతోంది. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి, మునిసిపాలిటీలో చెత్త పన్ను విధింపు, ఎస్సీ, ఎస్టీలపై కొనసాగుతున్న దాడులు, విపక్షాలకు చెందిన నేతలపై తప్పుడు కేసులు, ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసుల నమోదు, కరోనా నిబంధనల అమలులో ప్రభుత్వ వైఫల్యం, వ్యాక్సినేషన్ పై ఆర్బాటాలు, సర్కారీ బడుల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తేయడం, ఉద్యోగుల వేతనాలను సకాలంలో చెల్లించలేని వైనం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళుతున్న పరిస్థితులు, లెక్కాపత్రం లేకుండా ఖర్చులు, విపక్షాలకు చెందిన నేతల హత్యలు, అక్రమ కేసుల నమోదు, అరెస్టులు, అరెస్టుల్లో నిబంధనలు పాటించని వైనం, విపక్షాల నేతలను మానసికంగానే కాకుండా భౌతికంగానూ వేధిస్తున్న తీరు.. ఇలా ప్రతి అంశాన్ని ఆధారం చేసుకుని టీడీపీ వరుసపెట్టి నిరసనలు చేస్తోంది. ఈ నిరసనలకు క్రమంగా ప్రజలమ మద్దతు కూడా భారీగా పెరుగుతోంది. ఈ విషయాన్ని గమనించిందో, ఏమో తెలియదు గానీ.. మంగళవారం నాడు టీడీపీ నేతలపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని పోలీసుల నుంచి స్పష్టమైన హామీ వచ్చింది. ఈ ఒక్క ఘటన టీడీపీ నిరసనలతో వైసీపీ సర్కారు వణికిపోతోందని తేల్చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- టీడీపీ కేడర్‌కు దన్నుగా లోకేశ్ మార్కు ఆయుధం