ఏపీ సీఎం హోదాలో రెండేళ్ల క్రితం కుటుంబంతో కలిసి జెరూసలేం పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఆయన బిజీ షెడ్యూల్ నుంచి కాస్తంత ఉపశమనం కోసం మరోమారు ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనకు వెళుతున్నట్లుగా ఇటీవల వార్తలు వినిపించాయి. 5 రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో జగన్ తన ఫ్యామిలీతో కలిసి విహరించనున్నట్లుగానూ ఆ కథనాలు వెల్లడించాయి. అయితే జగన్ వెళ్లేది ఫారిన్ టూర్ కాదని, సిమ్లా పర్యటనకు ఆయన బయలుదేరుతున్నారని తాజాగా తేలింది. గురువారం మధ్యాహ్నమే తాడేపల్లి నుంచి సకుటుంబ సమేతంగా బయలుదేరనున్న జగన్ సిమ్లాలో నాలుగు రోజుల పాటు పర్యటిస్తారట.
తీర్పు వాయిదాతో ఊరట
అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం నాడు తుది తీర్పు వెలువడుతుందని అంతా అనుకున్నారు. అయితే ఈ పిటిషన్ కు ఇదే కేసులో ఏ2గా ఉన్న వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి బెయిల్ ను కూడా రద్దు చేయాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై వాదోపవాదాలు ముగిసిన నేపథ్యంలో ఈ రెండు పిటిషన్లపై వచ్చే నెల 15న తుది తీర్పు వెలువరిస్తానని బుధవారం సీబీఐ కోర్టు చెప్పింది. దీంతో జగన్ కు మరో 20 రోజుల పాటు ఊరట లభించిందనే చెప్పాలి. అయితే ఎక్కడ జగన్ బెయిల్ ను కోర్టు రద్దు చేస్తుందోనన్న భావనతో బుధవారం ఉదయం నుంచీ వైసీపీ శ్రేణులు ఓ రేంజి టెన్షన్ కు గురయ్యాయి. అయితే మధ్యాహ్నం కోర్టు తీర్పును వాయిదా వేయడంతో ఆ శ్రేణులతో పాటు జగన్ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి.
కరోనా వేళ టూర్లేంటో..?
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గనే లేదు. అప్పుడే థర్డ్ వేవ్ స్టార్టైపోయింది. అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ తనదైన ప్రతాపాన్ని చూపే ప్రమాదం లేకపోలేదన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జగన్ విహార యాత్రకు వెళుతున్న తీరుపై విమర్శలు రేకెత్తుతున్నాయి. కరోనా పూర్తిగా ఉపశమించని ప్రస్తుత తరుణంలో జనమంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పాల్సిన జగన్.. తానే కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళుతూ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వనున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ముందే కూసి జగన్ ను బుక్ చేసింది











