ఏపీకి రాజధాని ఏది? ఇందులో డౌట్ ఎందుకు? అమరావతే కదా. అది నిన్నటి మాట. ఇప్పుడు ఏపీ రాజధాని అంటే.. గూగుల్ కూడా మూడు రాజధానులను చూపిస్తోంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కూడా ఏపీకి రాసే లేఖలను మొన్నటిదాకా అమరావతిని అడ్రెస్ చేస్తూ రాస్తే.. ఇప్పుడేమో అమరావతి పేరు స్థానంలో హైదరాబాద్ అని రాస్తోంది. మొత్తంగా ఈ విషయంలో అయోమయమే నెలకొందని చెప్పాలి. అయితే రాజధాని అమరావతి నిర్మాణం కోసం మూడు పంటలు పండే బంగారం లాంటి తమ భూములను ఇచ్చిన రాజధాని రైతులు మాత్రం అలుపెరగకుండా అమరావతి కలను సారాకం చేసుకునేందుకు తమ పోరు సాగిస్తూనే ఉన్నారు. మొత్తంగా ఏపీ రాజధానిపై నెలకొన్న డైలమాకు ఏపీ సీఎం జగన్ కారణమైతే.. ఇప్పుడు కేంద్రం తీసుకున్న సరికొత్త నిర్ణయం ఆయనకే చెక్ పడేలా చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మాట తప్పి.. మడమ తిప్పేశారు
ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసినా. అమరావతిలోనే రాజధానిని కొనసాగిస్తానని చెప్పిన జగన్.. ఎన్నికల్లో విజయం సాధించి సీఎం కుర్చీ ఎక్కగానే మాట మార్చేశారు. మడమ తిప్పేశారు. అమరావతిలో ఒక్క కులానిదే ఆధిపత్యం సాగిస్తోందని చెబుతూ.. రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు. అమరావతిని శాసన రాజధానికి పరిమితం చేస్తూ.. పరిపాలనను విశాఖకు తరలిస్తామని, కర్నూలును న్యాయ రాజధానిగా మారుస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనపై రాజధాని రైతులు భగ్గుమన్నారు. 600 రోజులకు పైగా నాన్ స్టాప్ గా నిరసనలు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై వారు కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా జగన్ నిర్ణయంపై కేంద్రానికీ ఫిర్యాదు చేశారు. అయితే జగన్ తో మంచి సంబంధాలో, మరేం కారణమో తెలియదు గానీ.. రాజధాని నిర్ణయంపై తమకేమీ సంబంధం లేదని, ఈ విషయంలో నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని, ఇందులో కేంద్రం జోక్యం ఉండబోదని మోదీ సర్కారు తేల్చేసింది.
దిద్దుబాటలో కేంద్ర ప్రభుత్వం
తాజాగా తాను చేసిన పొరపాటును మోదీ సర్కారు గుర్తించినట్టుంది. ఏ రాష్ట్ర రాజధాని విషయంలో అయినా ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అని గతంలో చెప్పిన మాటను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెనక్కు తీసుకుంది. ప్రస్తుతం మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉందని, దీనిపై కోర్టుల నిర్ణయం తర్వాత తాము దృష్టి సారిస్తామని ఆ శాఖ వెల్లడించింది. ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడెప్పుడు విశాఖకు పాలనను తరలిద్దామన్న దిశగా పావులు కదుపుతున్న జగన్ సర్కారుకు బ్రేకులు పడినట్టేనని చెప్పాలి. ఎందుంకటే.. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే.. జగన్ సర్కారుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా కోర్టుల్లో ఈ విషయంపై దాఖలైన పిటిషన్ పై విచారణ పూర్తి అయిన తర్వాత గానీ కేంద్రం స్పందించే అవకాశాలు లేవు. మొత్తంగా విశాఖకు పాలనను తరలించడం జగన్ కు అంత ఈజీ కాదన్న మాట గట్టిగానే వినిపిస్తోంది.
Must Read ;- సీబీఐ ఒప్పుకుంది.. జగన్ బెయిల్ రద్దేనా?