ఆర్టీసీ ఆస్తుల విషయం కొత్తదేమీ కాదు. కానీ తాజాగా అయ్యన్న పాత్రుడి ఆరోపణలతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం అని జగన్ సర్కార్ ఏనాడో ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడగానే ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు, తమకు ఉద్యోగ భద్రత కలుగుతుందని ఆనందించారు. కానీ, ఆ ప్రకటన వెనక ప్రభుత్వ ఆంతర్యం వేరేగా ఉందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆర్టీసీ ఆస్తులను లీసుకిచ్చే విషయంలో ప్రభుత్వ విధానాలు గమనిస్తే, అధికార పక్షం ఆర్టీసీ ఆస్తులను హస్తగతం చేసుకునే ఆలోచన దాగుందా అనే అనుమానం తలెత్తకమానదు.
50 ఏళ్ల లీసు
వాణిజ్య నగరాలైన తిరుపతి, విశాఖపట్నం, కర్నాలు, తదితర నగరాల్లోని ఆర్టీసీ ఆస్తులను 50 ఏళ్లకు ప్రైవేట్ వారికి అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. దాదాపు 1300 ఎకరాల ఆస్తులను ప్రభుత్వం ప్రైవేట్ హస్తగతం చేయడానికి త్వరితగతిన పావులు కదుపుతుందని, అన్ని సంవత్సరాలు ప్రైవేట్ పరమైతే తిరిగి ప్రభుత్వానికి అందుతాయా అని ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వం 33 ఏళ్లకు లీసు ఇస్తేనే దారుణం అంటూ ఆరోపణలు చేసిన జగన్, నేడు ప్రభుత్వంలోకి వచ్చిసరికి లెక్కలు మారాయా లేకపోతే తన ఆరోపణలు తనే మర్చిపోయాడా అంటూ జగన్ ద్వంద వైఖరిని తేటతెల్లం చేశారు.
ప్రభుత్వ లోపాయికారితనం
ఆర్టీసీని నడపడం ప్రభుత్వానికి భారంగా మారిందని పక్క రాష్ట్రం ప్రకటిస్తుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు వ్యతిరేకంగా ప్రభుత్వ విలీనం అంటూ ముందుకొచ్చింది. ఈ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోయినా, కార్మికులు మాత్రం ఆనందపడ్డారు. ఈ ప్రకటన వెనక ఏదో మతలబుందని అనుమానించిన వారు లేకపోలేదు. అందరి అనుమానాలు నిజం చేస్తూ దాదాపు 1300 ఎకరాలను లోపాయికారిగా ప్రైవేటీకరణకు సిద్ధం చేస్తుంది ప్రభుత్వం.
అంతా డొంకతిరుగుడే
మన పక్క రాష్ట్రం కావచ్చు లేదా కేంద్రం కావచ్చు, ప్రైవేటీకరణను బహిరంగంగానే ప్రకటించి, అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం చేసేదంతా డొంకతిరుగుడు వ్యవహారంలాగానే కనిపిస్తుందనేది ప్రతిపక్షాలు ఆరోపణలు. పైకి ప్రభుత్వ విలీనం అంటూనే ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వారి చేతిలో పెడుతుందనేది విస్పష్టం. గత ప్రభుత్వ విధానాలు తప్పులతడికలంటూ ఎప్పుడూ ఆరోపించే జగన్ గణం, నేడు ఏకంగా 50 ఏళ్లకు ఆర్జీసీ ఆస్తులకు టెండర్ పెడుతున్నట్లు కనిపిస్తుంది. మరి జగన్ లోపాయికారి వ్యవహారానికి ఎలా పిలవాలో, ఏం పేరు పెట్టాలో ప్రజలకే వదిలేయాలి.
Must Read ;- దశా దిశా లేని దిశ చట్టం అస్తవ్యస్తమైన ఇసుక విధానం ఇవీ జగన్ నిర్ణయాలు











