రాజ్యాంగాన్ని పరి రక్షించే న్యాయవ్యవస్థపై పాలకులు రాజకీయ దాడికి పాల్పడుతున్నారని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బదిలీలు ఉంటాయని కూడా చెప్పారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, ఏపీ హైకోర్టు విషయంలో రాజకీయ జోక్యానికి తావిచ్చే విధంగా లాబీయింగ్ చేస్తోందని సీపీఐ నారాయణ ఆరోపించారు. అమరావతి భూముల వివాదం, స్థానిక సంస్థలకు ఎన్నికలు, వివాదాస్పద జీవోల విషయాల్లో ప్రభుత్వం చట్ట ప్రకారం నడుచుకోవాలని, అలా కాకుండా తనకు అనుకూలంగా తీర్పులు రావడం లేదన్న ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు న్యాయవ్యవస్థను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఆయన చెప్పిన కొన్ని గంటల్లోనే దేశ వ్యాప్తంగా ఏడెనిమిది రాష్ట్రాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, న్యాయమూర్తులను మార్చనున్నారని, ఇందుకు సుప్రీంకోర్టు కొలిజియం నిర్ణయం తీసుకుందని మీడియాలో వార్తలు వచ్చాయి. సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తిగా పేరున్న సీపీఐ నారాయణ ఊహించి మాట్లాడారా లేక కాకతాళీయంగా ఈ వ్యాఖ్యలు చేశారా అనే విషయం పక్కన బెడితే..బదిలీలకు సంబంధించి రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయనే వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బదిలీలు ఉండనున్నాయని ఆ వార్తల సారాంశం.
సుప్రీంకోర్టు నిర్ణయం మేరకే..
ఇక న్యాయమూర్తుల బదిలీలు, నియామకాలు, పదోన్నతుల విషయంలో సాధారణంగా ఎలాంటి వివాదాలు, అనుమానాలు తలెత్తే అవకాశం ఉండదు. సుప్రీంకోర్టు నిర్ణయం మేరకే ఈ కార్యకలాపాలు జరుగుతాయి కాబట్టి.. అత్యున్నత న్యాయస్థాన నిర్ణయాల్లో విమర్శలు, వివాదాలు సాధారణంగా ఉండదు. ఉండడం కూడా వ్యవస్థలకు మంచిది కాదు. అయితే, ఇటీవల ఏపీ సీఎం జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణపై పలు ఆరోపణలు చేస్తూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు. ఆ లేఖను బయటపెట్టారు కూడా. ఈ ఆరోపణల్లో భాగంగా కొన్ని నిర్ణయాల్లో ఆయన కొన్ని న్యాయస్థానాల్లో తీర్పులను ప్రభావితం చేస్తున్నారంటూ ఆరోపణ కూడా చేశారు. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆ విషయం సుప్రీంకోర్టు విచారణలో ఉంది.
Must Read ;- జగన్ జైలుకెళ్లడం ఖాయమేనా..?
సాధారణ బదిలీలేనా..?
ఈ నేపథ్యంలో.. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు జరగనున్నాయని మీడియాలో వార్తలు రావడం చర్చనీయాంశమైంది. ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సోమవారం ఢిల్లీలో సమావేశమైందని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌లతో పాటు మరికొన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని తీర్మానించినట్లు తెలిసిందని ఆ వార్తల సారాంశం.
మరోవైపు ఇది సాధారణ బదిలీలే అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏపీ హైకోర్టులో సీజే తర్వాత సీనియార్టీ ప్రకారం రెండో స్థానంలో ఉన్న జస్టిస్ రాకేశ్ కుమార్ పదవీ కాలం ఈ నెలతో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు మరో జడ్జిని నియమించాల్సి ఉంటుంది. వీరు ప్రధాన న్యాయమూర్తి తర్వాతి స్థానంలో ఉండే వ్యక్తిగా ఉండడంతోపాటు అవసరమైతే తత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బదిలీలు ఉంటాయని తెలుస్తోంది.
ఏపీలో 14 నెలలకే బదిలీ..
ఇక తెలంగాణ, ఏపీ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సేవల విషయానికి వస్తే..గత ఏడాది జూన్ 23న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి గత ఏడాది అక్టోబరు 7న బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. అంటే ఏపీలో 14 నెలలకే బదిలీ జరిగిందని చెప్పవచ్చు. ఇక తెలంగాణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఎవరిని నియమిస్తారు.. పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తుల నియామకం ఉంటుందా..లేక తత్కాలిక ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తారా అనేది రెండు మూడు రోజులకు తేలనుందని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఏపీ సీఎం వైఎస్ జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై, ఏపీ హైకోర్టు తీర్పులపై ప్రభావం ఉంటుందనే అంశంపై గతంలో లేఖ రాసిన నేపథ్యంలో..ఇప్పుడు జరుగుతున్న బదిలీలపై చర్చ జరుగుతోందని చెప్పవచ్చు.
Also Read ;- ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!