(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
వైసీపీ సర్కారు తెరచాటు వ్యవహారంతో ఇప్పటికే అప్రతిష్ట పాలైన మాన్సాస్‌లో మరో వివాదానికి శ్రీకారం సృష్టించారు. కొన్ని దశాబ్ధాలుగా విజయనగరం ప్రజలకు, ముఖ్యంగా క్రీడాకారులకు అందుబాటులో ఉన్న ఎమ్మార్ కాలేజీ స్టేడియంను మంగళవారం ఉదయం ఆకస్మికంగా మూసివేశారు. ఈ క్రీడా ప్రాంగణంలోకి కళాశాల విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది తప్ప ఇతరులకు ఎవరికీ ప్రవేశం లేదని నోటీసు పెట్టారు. దీంతో స్థానికులు, వాకర్లు, క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజోపయోగకరమైన సంస్థలను ఒకటొకటి మూసివేస్తూ మాన్సాస్ యాజమాన్యం ఏమి చేయదలచుకుందని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై మాన్సాస్ ఛైర్ పర్సన్ తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
బిగుసుకుంటున్న ఎమ్మార్ ప్రైవేటీకరణ
చారిత్రక ప్రసిద్ధి కలిగిన, జిల్లా కేంద్రమైన విజయనగరంలో వరుస ఆందోళనలతో మహారాజా కళాశాల ప్రైవేటీకరణ అంశం రోజురోజుకూ బిగుసుకుంటోంది. ప్రైవేటీకరణ చేస్తే ప్రభుత్వం ద్వారా వచ్చిన జీవోను బయటపెట్టాలి లేదా ప్రవేశాలు చేపట్టాలంటూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణను అన్ని వర్గాల వారు తీవ్రంగా వ్యతిరేకిసున్నారు. దీనిపై టీడీపీ చేపట్టిన సంతకాల సేకరణకు అనూహ్య స్పందన వచ్చింది. మరోవైపు విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది కూడా పోరాటానికి మద్దతు పలుకుతున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలసి రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా మాన్సాస్ నిర్ణయాలను ఎండగడుతున్నారు. అయినప్పటికీ ఇటు ఛైర్ పర్సన్ గాని అటు మాన్సాస్ విద్యా సంస్థల కరస్పాండెంట్ కాని పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వం తెరచాటున సహకరించడమేనన్నది బహిరంగ ఆరోపణ. మాన్సాస్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేందుకు అన్ని కోణాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు.
Must Read ;- ఎమ్మార్ కాలేజీ ప్రైవేటీకరణపై నిరసన.. అట్టుడికిన విజయనగరం
డిగ్రీ ప్రవేశాలు జరుగుతున్నట్టా? లేదా??
మహారాజా కళాశాలలో డిగ్రీ ప్రవేశాలు జరుగుతున్నట్టా లేదా అన్నది మేనేజ్‌మెంట్ కాని ప్రిన్సిపాల్ కాని స్పష్టత ఇవ్వడం లేదు. మరో వైపు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులను ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మహారాజ కళాశాలను ఎయిడెడ్ నుంచి తప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. అన్ ఎయిడెడ్ విద్యా సంస్థగా నడిపే ఆలోచన ఉందా లేదా పూర్తిగా కళాశాలనే లేకుండా చేసే పన్నాగమా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఇంతవరకు డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి యాజమాన్యం కాని, అటు ప్రభుత్వం కాని ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఈ అకడమిక్ ఇయర్‌ను జీరోగా చేసి వచ్చే ఏడాది నుండి కళాశాలను ప్రైవేట్ పరం చేసి భారీగా ఫీజులు వసూలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.
ఏదేమైనా మాన్సాస్ ఛైర్ పర్సన్ గా సంచైత గజపతి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఏదోరకమైన వివాదాన్ని ఆకస్మికంగా తెరపైకి తెస్తూ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలకు గండి కొడుతున్నారనే విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీనికంతటికీ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సహం, స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలేననే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.
Also Read ;- శాసనమండలికి తాకిన ఎమ్మార్ ప్రకంపనలు