(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
స్వార్థపూరిత రాజకీయాల వల్ల విజయనగరం జిల్లాలో ఎంతో గొప్ప చరిత్ర కలిగిన భీమసింగి సహకార చక్కెర కర్మాగారం మనుగడకు ముప్పు వాటిల్లింది. పాలకులకు ముందుచూపు లేకపోవడంతో కర్మాగారం మూతపడే పరిస్థితి దాపురించింది. దీన్ని ఉంచుతారా ..? ముంచుతారా ..? అని ఈ ప్రాంత రైతులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. సర్కారు వెనువెంటనే సరైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
44 ఏళ్లు చరిత్ర ..
భీమసింగి షుగర్ ఫ్యాక్టరీకి 44 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1976నుండి 2019 వరకూ 44 సంవత్సరాలు పాటు నిర్విరామంగా గానుగ ఆడింది. 16,873 మంది షేరు ధనం కలిగిన భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ ఈ సంవత్సరం గానుగ ఆడవలసి ఉన్నప్పటికీ నేటి వరకు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేదు. అందువల్ల ఈ ఫ్యాక్టరీ ఉంటుందో, మూసేస్తారో అర్థం కాకపోవడంతో దానిపై ఆధారపడిన చెరుకు రైతులు త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఫ్యాక్టరీని నమ్ముకొని జీవిస్తున్న కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఆరు నెలలుగా కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో ఆకలి మంటలు తప్పడం లేదని ఆ ప్రాంత వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీలో ఉన్న 35 వేల పంచదార బస్తాలు ఎందుకు అమ్మలేక పోతున్నారో? వచ్చే సంవత్సరం రైతులు చెరుకు పంట వెయ్యాలో, లేదో? సమాధానం లేని ప్రశ్నలుగా మిగులుతున్నాయని వాపోతున్నారు. ఫ్యాక్టరీలో పదవీ విరమణ చేసిన కార్మికులకు, ఉద్యోగులకు నేటికీ పీఎఫ్, గ్రాట్యుటీ చెల్లింపులు చేయకపోవడంతో కార్మికులు రోడ్డెక్కుతున్నారు. ఫ్యాక్టరీ ఆధునీకరణ పేరుతో ఆరు నెలలుగా కాలయాపన చేస్తుండటంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఈ సరికే ..
ప్రతి సంవత్సరం ఈ సరికే ఫ్యాక్టరీ బాయిలర్ పూజలకు ఏర్పాట్లు జరిగేవి. ఫ్యాక్టరీ కళకళలాడుతూ ఉండేది. ఈ సంవత్సరం అటువంటి సూచనలు ఏమీ కనిపించడం లేదు. ఈ ఫ్యాక్టరీ పరిధిలో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఇరువురు మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ ఉన్నప్పటికీ ఎవరూ పెదవి విప్పడం లేదని రైతులు ఆగ్రహిస్తున్నారు. వేలాది కుటుంబాలకు తిండి పెట్టే ఫ్యాక్టరీ బోసిపోతూ దిష్టిబొమ్మలా కనిపిస్తుండటాన్ని చూసి రైతులు తట్టుకోలేకపోతున్నారు. చెరకు పంట గిట్టుబాటు కాక అవస్థలు పడుతున్న తరుణంలో ఫ్యాక్టరీ మూసివేసి మరింత మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఫ్యాక్టరీకి పూర్వవైభవం తేవాలి
విజయనగరం జిల్లా రైతులకు ఎంతో ఉపయోగకరమైన భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే ఆధునీకరించి పూర్వ వైభవం తీసుకురావాలని లోక్‌సత్తా రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తక్షణమే ముఖ్యమంత్రిపై వత్తిడి తెచ్చి ఫ్యాక్టరీ ప్రారంభానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు, కార్మికులతో కలసి సోమవారం ఫ్యాక్టరీ ఎదుట పెద్దయెత్తున ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో లోక్‌సత్తా పార్టీ జిల్లా ప్రతినిధులు కాండ్రేగుల ప్రసాద్, కర్రి వెంకట నాగేశ్వరరావు, రాజాన సత్యనారాయణ, పొలుపర్తి అప్పల సత్యం, పల్లా మోహన్, మహేశ్వరవు భీంపల్లి భాస్కర్, కార్మిక నాయకులు పిన్నింటి కృష్ణ సిరికి వెంకట్రావు, రేగాని నిర్మల, లక్ష్మీ, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
Must Read ;- ఎమ్మార్ కాలేజీ ప్రైవేటీకరణపై నిరసన.. అట్టుడికిన విజయనగరం