సినిమా వారు రాజకీయాలను శాసిస్తారు అన్నారు జార్జ్ బెర్నార్డ్ షా.. ఆయన అన్నట్లుగానే జరిగిందిగానీ దీనికి ఎక్కడో ఫుల్ స్టాప్ పడిపోయింది. తెలుగునాట దీనికి నాంది పలికింది నటరత్న నందమూరి తారక రామారావే. సినిమాల పరంగానూ, రాజకీయాల పరంగానూ ఆయన సృష్టించిన చరిత్ర అసాధారణమైనది.
సినిమా రాజకీయానికి ఆది, అంతమూ ఎన్టీఆర్ తోనేనా? లేదా ఇలాంటి పరిస్థితి మున్ముందు కూడా ఉంటుందా? లాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరకదు. ఎన్టీఆర్ ని చూసి ఆ బాటలోనే నడవాలనుకుని భంగపాటు ఎదురైన వారు ఆ తర్వాత కాలంలో ఎందరో ఉన్నారు. రాజకీయాలకు ఎవరైనా అర్హులే.. కాదని అనలేం. అలాంటి శక్తి సామర్థ్యాలు వారికి లేవనీ అనలేం. సినిమాల్లో హీరోలుగా వెలిగినా రాజకీయంగా జీరోలుగా మారుతున్న హీరోలు ప్రస్తుత తరుణంలో ఎక్కువగా ఉన్నారు. సినిమా అనేది ఓ అందమైన బృందావనం లాంటిది.. రాజకీయం అనేది ఓ ముళ్ల బాట.. ‘ఈ రొంపిలోకి దిగి ఎందుకొచ్చాంరా భగవంతుడా’ అని బాధపడిన సందర్భాలు ఆయా హీరోల జీవితాల్లోనూ జరిగాయి.
అందుకే రాజకీయాల్లోకి దిగాలంటే హీరోలు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ఉదాహరణ సూపర్ స్టార్ రజినీకాంత్. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవచేయాలనో, ముఖ్యమంత్రి కావాలనే కోరికతోనే ఆయన ఉబలాటపడ్డారు. ఒకడుగు ముందుకు వేసి రెండడుగులు వెనక్కి వేస్తూ వచ్చారు. చివరికి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం తమిళనాడులో కమల్ హాసన్ రాజకీయాల్లో కీలకంగా కొనసాగుతున్నారు. దళపతి విజయ్ పేరు కూడా రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు అతను రాజకీయాల్లోకి రాకపోయినా ఏదో ఒకనాడు రాకతప్పదు.
Also Read ;- మెగాస్టార్ ని డైరెక్ట్ చేయనున్న రవితేజ డైరెక్టర్
తెలుగు హీరోల వెలుగులు ఎంతవరకు?
తెలుగులో ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో ఒక్క ఏపీలో మాత్రమే సినిమా రాజకీయం ఉంది. తెలగాణకు సంబంధించినంత వరకూ రాజకీయాల్లోకి వచ్చే హీరోలెవరూ కనుచూపు దూరంలో కూడా లేరు. బహుశా వచ్చే సాహసం చేయరేమో. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిని ఆశించి రాజకీయం చేసే హీరోలు అసలు లేరు. హీరోయిన్ మాత్రం ఉందండోయ్. ఆమె సినిమాలకు ఎక్కువ రాజకీయాలకు తక్కువ. ఆమె మరెవరో కాదు విజయశాంతి.
ఒకవిధంగా ఆమెను ఆవేశం స్టార్ అని జనం అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె చూపంతా భాజపా మీద ఉంది. కాలం కలిసి వస్తే ఆ పార్టీలో ఆమె కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. తెలంగాణకు సంబంధించినంత వరకూ సినిమా నటులు ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటే
ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం మాత్రమే ఉంటుంది.
Also Read ;- బాలయ్య బోయపాటి మూవీ డేట్ ఫిక్స్
ఏపీ విషయానికి వస్తే ముఖ్యమంత్రి పదవి మీద ఆశ ఉన్న హీరోలు ఉన్నారనే అనుకోవాలి. కానీ ఇప్పట్లో ఏపీలో ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. జమిలీ ఎన్నికలు వస్తే 2023లో ఎన్నికలు జరుగుతాయి. లేకుంటే 2024లో తప్ప ఎన్నికలు జరగడానికి అవకాశం లేదు. మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి భంగపడ్డారు. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి కేంద్ర మంత్రిగా చేశారు. ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవికి రాజకీయాలు అంతగా కలిసి రాలేదు. తిరుపతి నుంచి ఎమ్మల్యేగా ఎన్నికయ్యారు. నందమూరి బాలకృష్ణ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అన్నయ్య బాటలోనే పయనించి జనసేన పేరుతో పార్టీ ప్రకటించినా కనీసం అన్నయ్య సాధించిన సీట్లను కూడా సాధించుకోలేకపోయారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో ఆయనకు ఉన్న ఒకే ఒక్క ఆశా కిరణం భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీతో కదిలి వెళ్లడం మినహా మరో మార్గంలేదని ఈపాటికే ఆయనకు అర్థమైంది. ఈసారి ఎన్నికల్లో పవన్ కు తోడుగా అన్నయ్య చిరంజీవి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించకపోయినా జనసేన కీలకనేత నోటి నుంచి ఆ మాట రానే వచ్చింది.
ఒకవిధంగా చిరంజీవి చూపు భాజపా వైపు ఉందని అనుకోవాలి. ఇంకా చెప్పాలంటే చిరంజీవి తమ్ముడి పార్టీతో కొనసాగడానికి బదులు భాజపాలో చేరి ముందుకు వెళ్లడమే సముచితమని ఆయన శ్రేయోభిలాషులు ఆయనుకు సలహాలు ఇస్తున్నట్టు సమాచారం. అలా చేసినా అన్నదమ్ములు కలిసి ముందుకు వెళ్లి నట్టే ఉంటుంది. ఈ ముగ్గురు నటులకు తోడు జూనియర్ ఎన్టీఆర్ కూడా బరిలోకి దిగి అవకాశం లేకపోలేదు. కాకపోతే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోవచ్చు. పరోక్షంగా ఆయన కోరుకున్న పార్టీ విజయానికి ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Must Read ;- పవన్ సూచన మేరకే ‘చిరు’ సీక్రెట్ బయటపెట్టిన నాదెండ్ల
సినిమాల దూకుడు పెంచారెందుకు?
మన రాజకీయ హీరోలు సినిమాల దూకుడు ఎందుకు పెంచారన్నది ఇప్పుడు చూద్దాం. ఈ విషయంలో మెగా హీరోలు అగ్రస్థానంలో ఉన్నారు. ఎన్నికలు సమీపించే సమయానికల్లా చకచకా సినిమాలు పూర్తిచేసేయాలన్న సంకల్పంతో ఈ హీరోలు అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఏడాదికో, రెండోళ్లకో ఒక సినిమా చేసే హీరోల చేతుల్లో ఇప్పుడు నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ పూర్తయ్యే సరికి ఎన్నికలు సమీపించేస్తాయి. కొరటాల దర్శకత్వంలో చిరంజీవి ‘ఆచార్య’ చివరి దశకు వచ్చేసింది. మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్’ రీమేక్ షూటింగ్ ప్రారంభమైంది. బహుశా ‘లూసీఫర్’ సంక్రాంతి సినిమా కావచ్చు.
Also Read ;- పవన్ టైటిల్ విరూపాక్షి కాదు.. వీరమల్లు
ఇక మెహర్ రమేష్, బాబి, మలినేని గోపీచంద్ ల దర్వకత్వంలో సినిమాలు చేయాల్సి ఉంది. ఈ సినిమాలు 2022-23 వరకూ కొనసాగుతాయి. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ‘వకీల్ సాబ్’ ముస్తాబవుతోంది. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ జరుగుతోంది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో జరుగుతోంది. హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్వకత్వంలో పవన్ సినిమాలు చేయాల్సి ఉంది. పవన్ చేస్తున్నది రెండు పడవల ప్రయాణం. ఇటు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే ఇంకో పక్క సినిమాలు చేస్తున్నారు. నట సింహం నందమూరి బాలకృష్ణ మాత్రం సినిమాల విషయంలోనూ, రాజకీయం విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
బోయపాటి దర్శకత్వంలో చేసే సినిమా మేలో విడుదలవుతుంది. అలాగే తనకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన బి. గోపాల్ కు మరోసారి అవకాశం ఇవ్వాలని బాలయ్య నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలు పూర్తి చేయడానికి బాలయ్య ఎక్కువ సమయం తీసుకోరు. తన వారసుడు నందమూరి మోక్షజ్ఞ ను ఈ ఏడాది హీరోగా జనానికి పరిచయం చేయబోతున్నారు. అలా తన బాధ్యతలను పూర్తిచేసి ఇక రాజకీయాల మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. ఇలా చూసినప్పుడు రాబోయే ఎన్నికల్లో సినిమా రాజకీయం ‘తారా’స్థాయిలో ఉండబోతోందని భావించక తప్పదు.
– హేమసుందర్ పామర్తి