నిజమే.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో ఇదే ప్రశ్న అందరి నోటా వినిపిస్తోంది. మొన్నటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ పెంచి పోషించిన సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. అయినా కూడా రాజ్యాంగంలోని ఓ చిన్న అవకాశం ద్వారా.. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానే చట్టసభలో అడుగుపెడతానన్న ధీమాతో దీదీ బెంగాల్ సీఎం కుర్చీ ఎక్కారు. అయితే ఆ ఆరు నెలల సమయం కూడా ముగిసిపోతోంది. ఈ క్రమంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచి దీదీ బరిలోకి దిగుతున్నారు. అక్కడ దీదీపై బీజేపీ ఓ యువ అస్త్రాన్ని సంధిస్తోంది. కోల్ కతా హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న యువమోర్చా ఉపాధ్యక్షురాలు ప్రియాంకా టిబ్రేవాల్ ను బీజేపీ బరిలోకి దించుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా ఇప్పుడు భవానీపూర్ ఉప ఎన్నికల్లోనూ దీదీ ఓటమిపాలైతే పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు బెంగాల్ లో ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది.
సత్తా కలిగిన లాయర్‌గా టిబ్రేవాల్
41 ఏళ్ల వయసున్న ప్రియాంక.. కోల్ కతా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఈమె 2014 లో భారతీయ జనతా పార్టీలో చేరిన ప్రియాంక ప్రస్తుతం బీజేపీ యువజన విభాగమైన యువమోర్చాలో ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రియాంకను ఎంపీ బాబుల్ సుప్రియో బీజేపీలోకి తీసుకువచ్చారు. ఓ వైపు లాయర్ గా.. మరోవైపు బీజేపీ యువజన విభాగంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న ప్రియాంక.. రెంటిలోనూ సత్తా చాటుతున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం అనంతరం చోటుచేసుకున్న హింసకు సంబంధించిన కేసులో బీజేపీ తరఫున ప్రియాంకనే వాదనలు వినిపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీని బరిలోకి దింపిన బీజేపీ తొలిసారి ఫలితం సాధించలేకపోయినా.. రెండో సారి బంపర్ విక్టరీ సాధించింది. రాహుల్ నే ఓడించిన స్మృతి ఇరానీ.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఓ కీలెక నేతగా ఎదిగారు. ప్రస్తుతం ప్రియాంక కూడా దీదీని ఓడించగలిగితే.. టిబ్రేవాల్ కూడా కీలక నేతగా ఎదిగే అవకాశాలున్నాయి.
భవానీపూరే ఎందుకంటే..?
మొన్నటి ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన దీదీని ఓడించే మంత్రంతో ఆమెకు అత్యంత సన్నిహితుడిగా పేరుపడి ఆ తర్వాత తమ పార్టీలో చేరిన సువేందు అధికారిని బీజేపీ రంగంలోకి దించింది. దీదీని ఓడించింది కూడా. మరి ఇప్పుడు జరుగుతున్న భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందంటే.. దీదీ కోసమే ఇటీవలే అక్కడి నుంచి గెలిచిన తృణమూల్ అభ్యర్థి శోభందేబ్ చటోపాధ్యాయ్ రాజీనామా చేశారు. ఈ స్థానం నుంచి 2011, 2016 ఎన్నికల్లో దీదీనే గెలిచారు. అయితే మొన్నటి ఎన్నికల్లో నిందిగ్రామ్ ను ఎంచుకున్న ఆమె పరాభవం పాలయ్యారు. అందుకే.. తనకు బలమున్న భవానీపూర్ నుంచే మరోమారు గెలిచేందుకు దీదీ ప్లాన్ వేశారు. అందుకే అక్కడి తృణమూల్ ఎమ్మెల్యే శోభందేబ్ చటోపాధ్యాయ్ తో రాజీనామా చేయించారు. అయితే ఈసారి ఇక్కడి బైపోల్ లో టిబ్రేవాల్ గెలిస్తే మాత్రం దీదీ రాజకీయ ప్రస్థానం ప్రమాదంలో పడినట్టేనని చెప్పాలి.
Must Read ;- ఆయన వస్తానంటే వద్దంటున్నారట










