టాలీవుడ్ తెరకి పరిచయమైన ప్రత్యేకమైన ఆకర్షణ కలిగిన కథానాయికలలో కేథరిన్ కూడా కనిపిస్తుంది. నిలువెల్లా అందం అలుముకున్నట్టుగా .. కలువరేకులు కమ్ముకున్నట్టుగా .. కప్పుకున్నట్టుగా ఈ అమ్మాయి సమ్మోహితులను చేస్తుంది. అందాల కలశమా .. అమృతభాండమా అన్నట్టుగా కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది. మకరందాన్ని నింపుకున్నట్టుగా కనిపించే కళ్లతో కుర్ర హృదయాలను హోల్ సేల్ గా కొల్లగొట్టేస్తూ ఉంటుంది. కందిరీగల్లాంటి కళ్లతో కట్టిపడేసే ఈ అమ్మాయికి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
కథానాయికగా నిలదొక్కుకోవాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు .. అభినయం తెలియాలి .. అదృష్టం కలిసిరావాలి. కేథరిన్ అందానికీ .. అభినయానికి వంకబెట్టలేం. అదృష్టం పూర్తిస్థాయిలో పట్టకపోవడం వలన, ఆశించిన స్థాయిలో దూసుకెళ్లలేక పోతోంది. పదేళ్ల కెరియర్లో తెలుగులో ఓ పది సినిమాలు చేసి ఉంటుందేమో. ఆ సినిమాల్లో కూడా ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు తక్కువేనని చెప్పాలి. ఇక ఇప్పుడు మాత్రం కేథరిన్ తన స్పీడ్ పెంచడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
తెలుగులో ఈ అమ్మాయి చేసిన చివరి సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్‘. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆమె గ్లామర్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత సినిమాకి ఆమె సైన్ చేసిందనేది తాజా సమాచారం. చైతన్య దంతులూరి దర్శకత్వంలో ఆమె ఒక సినిమా చేయబోతోంది. శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందుతున్న సినిమాలో కథానాయికగా ఆమె కనువిందు చేయనుంది. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
Must Read ;- అందమంతా మోసుకొచ్చానంటున్న రష్మీ











