2019 ఎన్నికల్లో చంద్రబాబు చివరి వరకూ టికెట్ల కేటాయింపులో ఆపసోపాలు పడితే.., జగన్ మాత్రం ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లి సీఎం పీఠం దక్కించుకున్నాడు. ఇప్పుడు తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఏర్పడిన తిరుపతి ఉపఎన్నికలో.. అప్పుడు బాబుకు ఎదురైన పరిస్థితే ఇప్పుడు జగన్ కి ఎదురవుతోంది.
ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి బల్లి దుర్గాప్రసాద్ భార్య సరళమ్మ విముఖత వ్యక్తంచేసినట్లు పార్టీలో ఓ వైపు చర్చ నడుస్తోంది. భర్త పోయిన బాధలో ఉన్నానని, ఇలాంటి సమయంలో ఎన్నికల్లో పోటీచేసే ఢిల్లీ వెళ్లే ఆసక్తి తనకిలేదని తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు వైసీపీ పార్టీలో చర్చ నడుస్తోంది. గురువారం అమరావతిలో జగన్, నెల్లూరు జిల్లా నేతల భేటీలో ఈ విషయం చర్చకు వచ్చినట్లు ఆ పార్టీ నేతలు ఆఫ్ ద రికార్డ్ మీడియాకు చెప్పారు. సరళమ్మ వద్దంటున్నారు కాబట్టి, కుమారుడు కళ్యాణ్ కి లేదా ఇంకెవరికి ఇచ్చిన తాము పార్టీని గెలిపిస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు అందుకే సీఎం వద్ద తమ విధేయతకు ప్రదర్శించారంటున్నారు.
మరోవైపు.., వైసీపీ ఎంపీ మరణించిన స్థానంలో ఆయన భార్యకు టికెట్ ఇవ్వాలనుకున్న జగన్, ఆమె పోటీకి సిద్ధంగా లేరనే సమాచారంతో ఉండటంతోనే తనకు సన్నిహితుడైన డాక్టర్ గురుమూర్తి లేదా ఇంకెవరినైనా తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పాదయాత్రలో తన వెన్నంటి ఉన్న నమ్మకమైన వ్యక్తి కావడం, ఉప ఎన్నిక గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారడంతో జగన్ గురుమూర్తిని బరిలో దింపి, బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్ కి ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించినట్లు నెల్లూరు జిల్లాలో తీవ్ర చర్చ నడుస్తోంది.
గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించడానికి ముందు.. సీఎం జగన్, బల్లి కుటుంబ సభ్యులను అమరావతి పిలిపించి మాట్లాడతారని తెలుస్తోంది. టికెట్ ఎవరికి ఇచ్చినా పనిచేస్తామని వైసీపీ నేతలు నిన్న సీఎంతో భేటీలో చెప్పడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. తిరుపతి నుంచి బల్లి కుటుంబం నుంచి కాకుండా, ఇంకో కొత్తవ్యక్తిని బరిలో దించాలని సీఎం జగన్ మనసులో ఉంది కాబట్టే వైసీపీ నేతలు ఆ విధంగా మాట్లాడారని, లేకుంటే అసలు సీఎం ఎవర్ని అభ్యర్థిగా నిలబెట్టినా గెలిపిస్తాం అనే మాట ఎందుకు వస్తుంది అని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.
Must Read ;- ప్రజాభిప్రాయం ముసుగులో జగన్ మాట తప్పుతారా?!











