రాజధాని గ్రామాల్లో దళితులకు ప్రభుత్వం ఫించన్లు నిలిపివేసిందని, మా ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా కనిపించడం లేదని రైతులు ఫ్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఒక్కరోజు కూడా సభకు రాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాల్లో దళిత రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తాల్సిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించకుండా పోయారంటూ నిరసన తెలిపారు.
మీరు అసెంబ్లీకి రావద్దు
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కావాలనే వైసీపీ అధినేత శీతాకాల సమావేశాలకు రావద్దని సూచించినట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఉండవల్లి శ్రీదేవిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అవి కూడా వైసీపీ నేతలే స్వయంగా శ్రీదేవిపై ఆడియోలు, వీడియోలు రిలీజ్ చేయడంతో పార్టీ ప్రతిష్ఠ మంటకలిసింది. దీంతో ఇక ఉండవల్లి శ్రీదేవి అసెంబ్లీకి కూడా వస్తే ప్రతిపక్షాలు కూడా టార్గెట్ చేస్తాయనే ఉద్దేశంతోనే ఆమె శీతాకాల సమావేశాలకు దూరంగా ఉండాలని పార్టీ ఆదేశించినట్టు తెలుస్తోంది. పార్టీ ఆదేశాల మేరకు తాడికొండ ఎమ్మెల్యే గుంటూరులోనే ఉన్నా అసెంబ్లీ సమావేశాలకు కానీ, కనీసం మీడియా ముందుకు కానీ రాలేదని తెలుస్తోంది. కొన్నాళ్లు మీడియాకు కూడా దూరంగా ఉండాలని వైసీపీ అధిష్టానం ఆదేశించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉండవల్లి శ్రీదేవిపై వస్తున్న అవినీతి ఆరోపణల వల్ల ఒక్క తాడికొండ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం వైసీపీ పరువు పోతోందని, దీని వల్ల పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉండటంతో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అవినీతి ఆరోపణలు సభలో చర్చకు రాకుండా జాగ్రత్త పడ్డారా?
ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినా, ప్రతిపక్షం డిమాండ్ చేసిన 24 అంశాల్లో నాలుగు అంశాలపై మాత్రమే చర్చ చేపట్టారు. అందులో కూడా అధికార పక్షం సభ్యులు ఆరుగంటలు మాట్లాడితే ప్రతిపక్ష సభ్యులకు మైక్ ఇచ్చింది గంట మాత్రమే. ప్రతిపక్ష నేత లేచి రెండు నిమిషాలు మాట్లాడగానే వెంటనే వైసీపీ నుంచి చేతులు లెగుస్తున్నాయి. వెంటనే స్పీకర్ ప్రతిపక్ష నేతను కూర్చోబెట్టి, అధికారపక్ష సభ్యులతో మాటల దాడికి దిగుతున్నారు. దీని ద్వారా వైసీపీ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలు సభలో చర్చకు రాకుండా జాగ్రత్త పడ్డారు. పేదలకు సెంటుభూమి పేరుతో భారీ ఎత్తున అవినీతి జరిగినా సభలో చర్చకు వచ్చిన సందర్భం లేదనే చెప్పాలి. ప్రతిపక్షం అలాంటి ప్రయత్నం చేసినా, అధికార పార్టీ సభ్యులు లేచి అనవసర విషయాలు తెరమేదకు తీసుకువచ్చి, చర్చను సంబంధం లేని విషయాల్లోకి తీసుకెళ్లడంతో వ్యూహాత్మకంగా అవినీతి ఆరోపణలు సభలో చర్చకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇందులో భాగంగానే వైసీపీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. కొందరు వచ్చినా వారు నోరే మెదపలేదని సమావేశాలు చూసిన వారికి అర్థం అవుతోంది.
Must Read ;- జగన్ ‘సోషల్’ గా దిగజారాడా.. నేతల బాటలోనే క్యాడర్