జిల్లాల విభజన, రామాయపట్నం పోర్టు పేరుతో ప్రకాశం జిల్లాకు అన్యాయం జరుగుతోందనే వాదన ప్రజల్లో వ్యక్తమవుతోంది. కానీ, జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు మౌన వ్రతం పాటిస్తున్నారు. ఒక్క కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మాత్రం.. ఈ అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మానుగుంట ఆగ్రహానికి కారణం ఏంటి..?
కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో భాగం. కానీ, ఎంపీ స్థానాల పరిధిలోకి వచ్చే సరికి నెల్లూరులో ఉంటుంది. అలాంటిది ఇప్పుడు లోక్‌సభ ప్రాతిపదికన జిల్లాల విభజన చేస్తుండటంతో కందుకూరు కొత్తగా ఏర్పడబోయే నెల్లూరు జిల్లాలో కలుస్తోంది. దీన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కందుకూరు ఒంగోలుకి 40 కి.మీ. దూరం ఉంటే, నెల్లూరుకు 111 కి.మీ దూరం ఉంది. అంతేగాక ఎప్పటి నుంచో ప్రకాశం జిల్లాతో అనుబంధం ఉండటం వల్ల ప్రజలు కూడా నెల్లూరు జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
రామాయపట్నం వల్ల జిల్లాకు లాభమా? నష్టమా?
రామాయపట్నం పోర్టు కోసం బాబు హయాంలో వేసిన ఓ శంకుస్థాపన రాయితప్ప ఇంక ఏమీలేదు. కానీ, ఇప్పటి నుంచే పోర్టు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ప్రాథమికంగా పోర్టు కోసం 802 ఎకరాలు కావాలని, ఆ తర్వాత మరో 1,200 ఎకరాలు, మొత్తంగా పోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యే నాటికి మొత్తంగా 3,420 ఎకరాలు కావాలని పోర్టు అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. వారు ఓకే అన్నారు. రామాయపట్నం పోర్టు కోసం ప్రకాశం జిల్లాలో మొత్తం 3,773 ఎకరాలు సేకరిస్తున్నారు. దీనిలో పోర్టుకే 3,420 పోతే, ఇక మిగిలింది పరిశ్రమల స్థాపనకు. అదే పక్కనే ఉన్న నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మాత్రం పరిశ్రమల కోసం ఏపీఐఐసీ ద్వారా 6,500 ఎకరాలు సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోర్టు కోసం సర్వం త్యాగం చేసిన ప్రకాశం జిల్లాలో తక్కువ ఎకరాల్లో పరిశ్రమలు.., ఒక్క ఎకరా భూమి కూడా పోర్టు కోసం త్యాగం చేయని నెల్లూరు జిల్లాలో మాత్రం 6,500 ఎకరాల్లో పరిశ్రమల స్థాపన. ఇదేం న్యాయమని ప్రకాశం వాసులు అంటున్నారు. పోర్టు మాత్రమే జిల్లాలో ఉండి అభివృద్ధి అంతా నెల్లూరు జిల్లా పరిధిలో జరిగేలా అధికార పార్టీలోని నెల్లూరు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. ఇంత జరుగుతున్నా, జిల్లా ప్రయోజనాలను మన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పట్టించుకోరా అని కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నిస్తున్నారు.
కానీ, జిల్లాలోని ఇద్దరు మంత్రులు, మిగతా 11 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా వారం అయినా ఈ రోజుకీ పెదవి విప్పడం లేదు. చివరకి జిల్లాల విభజనలో కూడా తమ నియోజకవర్గంలో వ్యక్తిగత స్వార్ధం చూసుకుని ప్రజలకు జరుగుతున్న అన్యాయం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
జల్లాలో ప్రతి పక్షాలు లేవా..?
వెలిగొండ, రామాయపట్నం పోర్టు కోసం వామపక్షాలు ఉద్యమాలు చేశాయి. వారి పోరాటాల ఫలితమే వెలిగొండ.., అందుకే కమ్యూనిస్టు నేత పూల సుబ్బయ్య గారి పేరు మీద పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ అని దానికి పేరు పెట్టారు. రామాయపట్నం పోర్టు కోసం భారీ స్థాయిలో పోరాటం చేయకపోయినా? కొంత వరకూ పోర్టు సాధనలో వారి కృషి ఉంది. కానీ, వారు అసలు ఈ అన్యాయం ఏంటని ప్రశ్నించడం లేదు. ఇక కందుకూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు పోతుల రామారావు, దివి శివరాం కూడా సైలెంట్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి రాగానే పోతులు గ్రానైట్ కంపెనీలపై వరుస దాడులు జరిపి, అక్రమాలకు పాల్పడ్డారని కోట్లలో ఫైన్‌లు వేశారు. కోర్టుకు వెళ్లి తిప్పలు పడి ఆ బాధల నుంచి ఆయన బయటపడ్డారు. గత 7 ఏళ్లు నుంచి టీడీపీకి జిల్లా అధ్యక్షునిగా ఉన్న దామచర్ల జనార్థన్ 2019 ఎన్నికల్లో ఓటమితో బెంగుళూరులో వ్యాపారాలు చేసుకుంటూ చుట్టపు చూపుగా జిల్లాకు వచ్చిపోతున్నారు. సీనియర్ నేత కరణం బలరాంలో పాటు చాలామంది వైసీపీలో చేరి సైలెంట్ అయ్యారు. దీంతో జిల్లాలో ఒక్క మానుగుంట తప్పితే ఇక ఎవ్వరూ జిల్లాకు జరుగుతున్న అన్యాయం గురించి కనీసం ప్రశ్నించే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు
ఇప్పటికైనా నేతలు గళం విప్పి ప్రజలకు భరోసా ఇస్తారో.. లేక మనకెందుకని సైలెంట్ అవుతారో వేచి చూడాల్సిందే.
Must Read ;- వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నాట్ట! ఎందుకో తెలుసా?