ఏపీ శాసన మండలిలో వైసీపీకి నేటికీ సరైన బలం లేదు. ఇప్పటికీ టీడీపీదే హవా కొనసాగుతోంది. మండలిలో టీడీపీ సభ్యులను అదుపు చేయాలంటే అంకెల గారడీ చేసే బుగ్గన రాజేంధ్రనాద్ రెడ్డి కరెక్ట్ అని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించారట. వెంటనే ఆయన్ని పిలిచి మండలిలో వైసీపీ పక్ష నేతగా వ్యవహరించాలని సీఎం ఆదేశించి, అక్కడ నుంచి వెళ్లిపోయారని సమాచారం. ఇక బుగ్గన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం కూడా సీఎం చేయలేదట. ఇప్పుడు ఉన్న నొప్పులతోనే చస్తుంటే ఈ కొత్త తలనొప్పి నాకెందుకు అని బుగ్గన తలపట్టుకున్నారట. అయితే అక్కడే ఉన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల కలుగజేసుకుని, మరేం పరవాలేదు, సత్తెన్న చూసుకుంటారు. మీరు అలా మండలిలో ఉంటే చాలు అని సముదాయించారని తెలుస్తోంది.
మంత్రుల్లో సగం మంది మండలిలోనే
మంత్రులు ఏ సభలోనైనా కూర్చోవచ్చు. అందుకే మంత్రుల్లో చాలా మందిని వైసీపీ అధినేత మండలిలో మోహరించారని తెలుస్తోంది. ముఖ్యంగా ఏం మాట్లాడతారో అర్థంకాని విధంగా మాడ్లాడే మంత్రులనే సీఎం సెలెక్ట్ చేసి మరీ మండలిలో కూర్చోవాలని చెప్పారట. మంత్రి బొత్స సత్యనారాయణ, మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లు ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడకు వెళతారో వారికే తెలియదు. ఇలాంటి వారిని మండలిలో మోహరించి, టీడీపీ వారి వాయిస్ వినిపించకుండా పెద్దగా అరవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. వైసీపీ అధినేత కావాలనే గట్టిగా అరవగలిగేవారిని మండలికి పంపించారని తెలుస్తోంది. అంటే ఏ విషయంపైన ఎవరికి పట్టుంది.. అని సహజంగా ఆలోచిస్తారు, కానీ మండలిలో మాత్రం, సంబంధం లేని అంశాలను తెరమీదకు తీసుకువచ్చి, చర్చ చేపట్టిన అంశాన్ని శంకరగిరి మాన్యాలకు పంపించి వేయడంలో మంత్రులు బొత్స, అనిల్ యాదవ్ రెండు రోజులుగా సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు.
బూతులు తప్పనిసరి
ఏపీ అసెంబ్లీలో, మండలిలో అధికార పార్టీ సభ్యుల బూతు పంచాగం కామన్ అయిపోయింది. కనీసం 18 మంది టీడీపీ సభ్యులకు కూడా సబ్జెక్టుతో అదిరిపోయే సమాధానం చెబుదామన్న ఆలోచన అధికార పార్టీ సభ్యుల్లో కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష నేతలను సూటిపోటి మాటలు అనడం ద్వారా వారి మానసిక స్థైర్యం దెబ్బదీయాలని చూస్తున్నారని, కానీ ప్రతిపక్ష సభ్యులు అడిగిన వాటికి మాత్రం సూటిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయడం లేదని సమావేశాలు పరిశీలిస్తే ఎవరికైనా అర్థం అవుతుంది.
బీమా చెల్లిస్తే మీకేంటి, చెల్లించకపోతే మీకేంటి?
ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి పంటల బీమా విషయంలో అసెంబ్లీలో చేసిన ఈ వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్లో చర్చకు దారితీసిందట. పంటల బీమా చెల్లించామని సాక్షాత్తూ వ్యవసాయ మంత్రి కన్నబాబు ప్రకటించారు. తరవాత సీఎం మాత్రం పంటల బీమా చెల్లిస్తే మీకేంటి, చెల్లించకపోతే మీకేంటి అని ప్రతిపక్షాలపై దాడికి దిగారు. అంతే కాదు ప్రతిపక్ష నేతను పట్టుకుని మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలంటూ పదేపదే చెప్పడం చూస్తుంటే, వైసీపీ నేతలు సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డట్టు అనుమానించాల్సి వస్తోంది. సెంటు భూమి పేరుతో రూ.4 వేల కోట్ల దోపిడీకి తెరలేపిన వైసీపీ నేతలు, పేదలకు సెంటు భూమి ఇవ్వడంతోనే వారు లక్షాదికారులు కాబోతున్నారంటూ భజన చేసుకోవడం చూస్తుంటే, వారి చాప కిందకు వారే నీరు తెచ్చుకుంటున్నట్టు భావించాల్సి వస్తోంది. అసెంబ్లీలో, మండలిలో ప్రతిపక్షాల నోళ్లు మూయించవచ్చు, కానీ ప్రజలు అంతా గమనిస్తూనే ఉంటారు. అక్కడేం జరుగుతుందో ప్రజలకు విడమరిచి చెప్పాల్సిన పనిలేదు. అధికార పార్టీ నేతలు పదవులు కాపాడుకునేందుకు పడుతున్న పాట్లు అందరికీ తెలిసిపోతూనే ఉంది.
Also Read: నేరచరితగల అభ్యర్థుల్లేని ఏకైక పార్టీ టీడీపీ!











