జయసుధ .. సౌందర్య తరువాత ఆ స్థాయిలో సహజమైన నటనను ఆవిష్కరించే కథానాయిక ఎవరంటే ‘సాయిపల్లవి’ పేరు వినిపిస్తుంది. ఆకర్షణీయమైన కళ్లతో హావభావాలను ఆవిష్కరించడం .. నవరసాలను ఒలికించడం సాయిపల్లవి ప్రత్యేకత. సాయిపల్లవికి తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఎడాపెడా సినిమాలు చేసుకుంటూ వెళ్లడానికి ఆమె ఇష్టపడదు. కథ .. తన పాత్ర నచ్చితే మాత్రమే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేదంటే పెద్దమొత్తంలో పారితోషికం ఆఫర్ చేసినా ఆమె సున్నితంగా తిరస్కరిస్తుంది .. అదే సాయిపల్లవి ప్రత్యేకత.
‘ఫిదా‘ సినిమా ద్వారా తెలుగు తెరకి సాయిపల్లవి పరిచయమైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె వరుణ్ తేజ్ జోడీగా అలరించింది. లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ‘భానుమతి’ పాత్రలో ఆమె నటించింది. హీరోయిన్ పెద్ద అందగత్తేమీ కాదనుకుంటూ థియేటర్ కి వెళ్లినవారు, ఆమె అభినయ సౌందర్యానికి ఫిదా అయ్యారు. సాయిపల్లవి నటన .. ఆమె డాన్స్ చూసిన ప్రేక్షకులు ఆమె అభిమానులుగా మారిపోయారు. ఆ తరువాత వచ్చిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి‘ సినిమాతోను ఆమెకి విజయంతో పాటు ప్రశంసలు దక్కాయి.
ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘లవ్ స్టోరీ’ సినిమా ద్వారా ఆమె పలకరించనుంది. ఈ సినిమాలో ఆమె జోడీగా నాగచైతన్య నటిస్తున్నాడు. ఆ తరువాత సినిమాగా ఆమె ‘విరాటపర్వం’ చేస్తోంది. రానాతో పాటు ఈ సినిమాలో ఆమె ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. ఇంతవరకూ తాను చేసిన పాత్రలకి ఇది పూర్తి భిన్నమైన పాత్ర అని తనే చెబుతోంది. ఈ పాత్ర తనకి మరింత మంచి పేరు తీసుకొస్తుందని అంటోంది.
గతంలో ఒకే ఏడాదిలో సాయికిపల్లవి ‘ఫిదా’ .. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’తో రెండు ఘన విజయాలను అందుకుంది. విభిన్నమైన కథలతో .. విలక్షణమైన పాత్రలతో సాయిపల్లవి చేసిన ఈ సినిమాలు ఆమె కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచాయి. ప్రస్తుతం ఆమె చేస్తున్న ‘లవ్ స్టోరీ’ .. ‘విరాటపర్వం‘ వచ్చే ఏడాదిలో రంగంలోకి దిగుతున్నాయి. ఈ రెండు సినిమాలు సక్సెస్ ను సాధించడం ఖాయమనే ధీమాతో ఆమె ఉంది. 2017లో సాయిపల్లవి చేసిన మేజిక్ మళ్లీ వచ్చే ఏడాది రిపీట్ అవుతుందేమో చూడాలి.
Must Read ;- మహేష్ మచ్చల గురించి సాయిపల్లవికి ఎలా తెలుసు?